IRR కేసులో Chandra Babu బెయిల్ పిటిషన్ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.

Update: 2023-09-29 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది. ఇకపోతే ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఈనెల 27న విచారణ జరిపింది. తొలుత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 29కు వాయిదా వేసింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ఉన్నాయని ఏజీ శ్రీరాం వాదించారు. లింగమనేని భూముల పక్కనుంచి రోడ్ వెళ్లేలా అలైన్‌మెంట్ మార్పులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలైన్‌మెంట్ మార్పు అనంతరం లింగమనేని భూముల విలువ భారీగా పెరిగిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూ అక్రమాలకు పాల్పడ్డాయని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

ఏ-14 నిందితుడిగా లోకేశ్

అమరావతి రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదుతో 2022 మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏ-1 నిందితుడిగా పేర్కొంది. అలాగే మాజీమంత్రి నారాయణ, లింగమనేని తోపాటు పలువురుని సీఐడీ నిందితులుగా పేర్కొంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సైతం సీఐడీ మెమోలో ఏ-14గా పేర్కొంది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి : Chandra Babu ముందస్తు బెయిల్ పిటిషన్‌పై High Court లో విచారణ

Tags:    

Similar News