చంద్రబాబు బరువు తగ్గలేదు..కిలో బరువు పెరిగారు: కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జైల్లో చంద్రబాబు నాయుడు బరువు తగ్గారు అని పదేపదే ఆరోపిస్తున్నారు. ఐదు కేజీల బరువు చంద్రబాబు తగ్గారని మరో రెండు కేజీల బరువు తగ్గితే ఆయన ఆరోగ్యానికి ప్రమాదకరం అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారంపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు బరువు తగ్గలేదని వివరణ ఇచ్చారు. ఒక కిలో బరువు పెరిగారని డీఐజీ వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్నారని ప్రస్తుతం చంద్రబాబు బరువు 68 కిలోలు అని డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చారు. బరువు తగ్గారు అన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉందని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చారు.
నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారని అందువల్ల ఓఆర్ఎస్ వినియోగిస్తున్నట్లు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. నిబంధనల ప్రకారంగానే తాము పనిచేస్తున్నామని.. దేశంలోని ఏ జైలులో కూడ ఏసీలు లేవని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరం జైలులో సుమారు 2వేల మంది ఖైదీలున్నారని వీరిలో కొందరికి పలు అనారోగ్య సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తలెత్తిన అనారోగ్య సమస్యలపై వైద్యులతో ట్రీట్‌మెంట్ ఇప్పించినట్లు వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతుందని అది సరికాదన్నారు. జైలులో ఉన్న వైద్యులు చంద్రబాబును ప్రతి రోజూ చెక్ చేస్తున్నారని... డీ హైడ్రేషన్‌కు సంబంధించి ట్రీట్‌మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. స్కిన్ ఎలర్జీకి సంబంధించి కూడ మందులు అందించినట్టుగా వివరణ ఇచ్చారు. చంద్రబాబు శరీరంపై దద్దుర్లు వచ్చినట్టుగా వైద్యులు వెల్లడించారని అన్నారు. చంద్రబాబును గురువారం రాత్రి,శుక్రవారం ఉదయం వైద్యులు పరీక్షించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు శుక్రవారం ఉదయం చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్‌ను సైతం విడుదల చేశారని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు.