కప్పట్రాళ్ల లో యురేనియం త్రవ్వకాలకు కేంద్రం అనుమతి

కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వాసుల్లో మళ్లీ యురేనియం భయం మొదలైంది. కేంద్రం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు అనుమతి ఇచ్చింది.

Update: 2024-10-18 05:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వాసుల్లో మళ్లీ యురేనియం భయం మొదలైంది. కేంద్రం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు అనుమతి ఇచ్చింది. అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎండీ) చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లోని 6.8 హెక్టార్లలో యూసీఐఎల్‌ అధికారులు త్రవ్వకాలు చేపట్టనున్నారు. అటవీ భూముల్లో త్రవ్వకాలు చేయాల్సి ఉన్నందునా కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం లభించగానే త్రవ్వకాలు ప్రారంభించనున్నారు. భూగర్భంలో ఎంత పరిమాణంలో యురేనియం నిల్వలు ఉన్నాయో నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అందుకే కప్పట్రాళ్ల కేంద్రంగా యురేనియం ఎంత ఉంది? ఎంత లోతులో ఉంది? దాని నాణ్యత ఎంత..త్రవ్వితే లాభమా.. కాదా..? వంటి వివరాలు తెలుసుకునేందుకు 68 బోర్లు డ్రిల్లింగ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. కాగా యురేనియం త్రవ్వకాల పట్ల కప్పట్రాళ్ల వాసులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అణు విద్యుత్‌ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే యురేనియం పేరు చెబితే కర్నూలులోని పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. ఇక్కడి కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు సర్వే కోసం బోర్ల తవ్వకాలకు అనుమతులు వచ్చాయనే సమాచారం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రమాదకరమైన ఆ రసాయన మూలకం తవ్వకంతో తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని, పచ్చని పల్లెలు అణుధార్మికత భారిన పడుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఊళ్లలో సర్వేలు వద్దు.. తవ్వకాలు వద్దు.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అడ్డుకుంటామని తెగేసి చెబుతున్నారు. యురేనియం నిల్వలు అంచనా వేసేందుకు జరిపే తవ్వకాల వల్ల కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. భూగర్భ జలాలు, తాగునీరు విషతుల్యం అవుతాయని స్థానికులు భయపడుతున్నారు. అరుదైన జీవరాసులు, వృక్షసంపద ప్రమాదంలోపడి జీవవైవిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత కారణంగా కప్పట్రాళ్ల సహా చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆదోని రేంజ్‌ పత్తికొండ సెక్షన్‌ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్‌.. కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఇప్పటికే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం తుమ్మలపల్లె, కేకే కొట్టాల, మొబ్బుచింతపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామాల్లో యూసీఐఎల్‌ 2007లో యురేనియం ప్లాంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2011 నుంచి ముడి యురేనియం వెలికితీసి శుద్ధి చేసే ప్రక్రియ మొదలైంది. యురేనియం ప్రభావంతో గాలి, నీరు, భూమి కలుషితమవుతోందని, స్థానిక ప్రజలు, పాడి పశువులు, జంతువులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, మహానంది, రుద్రవరం మండలాల్లోని అడవుల్లో యురేనియం అన్వేషణ కోసం 2019లో బోర్లు వేయబోతే అప్పట్లో స్థానికులు అడ్డుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్‌ రిజర్వ్ ఫారెస్టు టైగర్ జోన్ పరిధిలోని దేవరకొండ డివిజన్ పరిధిలోని చింత్రియాల,నల్లమల అటవీ పరిధిలోని నంబాపురం, కంబాలపల్లి, పెద్దగట్టు, పెద్దమూల, శేరిపల్లి, ముదిగొండ గ్రామాలు, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ బ్లాక్‌లోని ఉడిమిళ్ల, తిరుమలాపూర్, ఉప్పునూతల గ్రామాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజాందోళనలను పట్టించుకోకుండా కేంద్ర అణు ఇంధన నల్లమల పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో అమ్రాబాద్ పులుల సంరక్షణ పరిధిలో 21వేల ఎకరాల్లో 83 చదరపు కిలోమీటర్ల మేరకు బోర్లు వేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రాంత ప్రజల ఉద్యమాలతో త్రవ్వకాలపై వెనక్కి తగ్గింది.

కేంద్ర ప్రభుత్వ అణు ఇంధన శాఖ నియమిత యూనిట్ అయిన అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) నల్లగొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగట్టు, చింత్రియాల్‌లలో కేంద్ర 1999 నుంచి 2012 వరకు యురేనియం అన్వేషణ కోసం సర్వే, తనిఖీ చేపట్టింది. ఆ ప్రాంతాల్లో సుమారు 18,550 మెట్రిక్ టన్నుల యూరేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్‌లోని డీఏఈ, ఏఎండీ తరపున నాగార్జునసాగర్ డబ్ల్యూఎల్‌లోని చింత్రియాల్ ప్రాంతంలోని అదనపు 50 చదరపు కిలోమీటర్ల పైబడి సర్వే, తనిఖీ, బోర్లను తవ్వడం కోసం హైదరాబాద్‌లోని ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకుడికి 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 127 ద్వారా అనుమతి ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాంతంలో యురేనియం బయటకు తీసేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. అప్పటికే ఉన్న అన్ని అనుమతులను రద్దు చేసినట్లుగా వెల్లడించింది.


Similar News