బీసీలను బానిసలుగా చేసుకునేందుకే కులగణన: కొల్లు రవీంద్ర

బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికి, వారిని శాశ్వతంగా తన బానిసల్ని చేసుకోవడానికే జగన్ రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం మొదలెట్టాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Update: 2023-11-23 10:02 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికి, వారిని శాశ్వతంగా తన బానిసల్ని చేసుకోవడానికే జగన్ రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం మొదలెట్టాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బీసీల పథకాలు...ప్రయోజనాలకు గండి కొట్టి వారిని శాశ్వతంగా తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వాడుకోవడానికే జగన్ రెడ్డి తన జేబు సంస్థలతో తూతూమంత్రంగా కులగణన చేయాలని చూస్తున్నాడు అని ఆరోపించారు. కులగణన..జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వలంటీర్లకు.. ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు అని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జాతీయ బీసీ కమిషన్ అనుమతితో.. రిటైర్డ్ జస్టిస్ నేత్రత్వంలోని కమిటీ నిబంధనల ప్రకారమే కులగణన వివరాలు సేకరిస్తున్నారా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు నేరుగా ప్రధానిని కలిసి కులగణన గురించి తెలియచేసి ఆమోదం పొందాకే బీసీల వివరాలు సేకరించాలి అని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి మెప్పుపొంది.. తన స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే ఆర్.కృష్ణయ్య బీసీల జపం చేస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న ద్రోహం... దుర్మార్గం చూశాక కూడా వైసీపీలోని బీసీనేతలు.. మంత్రులు ఏ ముఖంపెట్టుకొని సిగ్గులేకుండా అధికారపార్టీలో ప్రభుత్వంలో కొనసాగుతున్నారో వారే చెప్పాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బస్సు యాత్ర

ఎన్నికల్లో లబ్ధి పొందడానికే జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వంచిస్తూ తన పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎలాగైనా మరలా అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి ఉవ్విళ్లూరుతుంటే , వైసీపీలోని బీసీ నేతలు, మంత్రులు నిస్సిగ్గుగా ఆయనకు వంతపాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ రెడ్డి .. అతని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి.. ఇతర కీలక పదవుల్లో కొనసాగడానికి బీసీలు పనికిరారా? సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహణను.. దాని పర్యవేక్షణ ఏర్పాట్లను ఏరికోరి తనవర్గం వారికి.. బీసీయేతర వర్గాలకు కట్టబెట్టిన జగన్ రెడ్డి ఏ విధంగా బీసీలకు మేలు చేశాడో..చేస్తున్నాడో అధికారపార్టీలోని బీసీ నేతలు.. బీసీ మంత్రులు చెప్పాలి. బీసీల స్వాధీనంలో ఉన్న 14లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కొల్లగొట్టినా జగన్ రెడ్డిని ప్రశ్నించలేని వైసీపీ బీసీ నాయకత్వం బీసీలకు అవసరమా?’ అంటూ కొల్లు రవీంద్ర నిలదీశారు.

ఆర్ కృష్ణయ్యవి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు

మరోవైపు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి దమనకాండకు, దుర్మార్గపు పాలనకు బీసీలు బలైనప్పుడు వేలాది బీసీకుటుంబాలు రోడ్డునపడినప్పుడు కృష్ణయ్య ఎక్కడున్నాడు? అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినప్పుడు.. దాదాపు 70మందికి పైగా బీసీ కీలకనేతల్ని దుర్మార్గంగా జగన్ రెడ్డి చంపించినప్పుడు కృష్ణయ్య ఎందుకు నోరెత్తలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ప్రతినిధినని చెప్పుకోవడం తప్ప రాజ్యసభ సభ్యుడిగా ఏనాడైనా జగన్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న ద్రోహంపై కృష్ణయ్య పార్లమెంట్‌లో గొంతు విప్పాడా? అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్య మంత్రిగా ఆర్.కృష్ణయ్య పేరుని ప్రకటించింది తెలుగుదేశం పార్టీనేని చెప్పుకొచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకే పరిమితమైన ఆర్.కృష్ణయ్య పద్ధతి మార్చుకొని బీసీలకు న్యాయంచేస్తాడని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆయన ఏనాడూ తన వర్గాల కోసం గొంతెత్తింది లేదు అని కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినా, రాజ్యాంగపరంగా బీసీలకు దక్కాల్సిన స్థానిక సంస్థల పదవులు దక్కకుండా చేసినా, బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టినా ఆర్.కృష్ణయ్య ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో.. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లుగా బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏనాడూ జగన్ రెడ్డిని కృష్ణ య్య ఎందుకు ప్రశ్నించలేకపోయాడని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ బాలుడిని తగలబెట్టినప్పుడు కృష్ణయ్య ఎక్కడ?

రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపినప్పుడు కృష్ణయ్యకు బీసీలు గుర్తురాలేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ‘తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ సోదరుల్ని పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గూండాలు దారుణంగా బట్టలు విప్పి అవమానిస్తే కృష్ణయ్యలో చలనం లేదు. నెల్లూరుజిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ని వైసీపీ నాయకుడు చావగొడితే మానవత్వంగా కూడా కృష్ణయ్య మాట్లాడలేదు. ధర్మవరం వస్త్ర వ్యా పారులు తమకు రావాల్సిన బకాయిలకోసం విజయవాడకు వస్తే... వారికి డబ్బు ఇవ్వకుండా కొట్టి అవమానిస్తే దానిపై కృష్ణయ్య ఎందుకు స్పందించలేదు?’ అని కొల్లు రవీంద్ర ప్రశ్నల వర్షం కురిపించారు. తనపై అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు.. అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై కృష్ణయ్య ఏనాడూ ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు? అని నిలదీశారు. బీసీ మహి ళలైన పంచుమర్తి అనురాధ.. ఆదిరెడ్డి భవానీ వంటి వారిని జగన్ రెడ్డి.. అతని ఎమ్మెల్యేలు.. వైసీపీనేతలు దారుణంగా అవమానించి న విషయం కృష్ణయ్యకు గుర్తులేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకులమైన మేం ఎప్పుడూ బీసీలపక్షానే నిలుస్తాం. కృష్ణయ్యలాగా పదవులకోసం.. స్వ ప్రయోజనాలకోసం బీసీల్ని వాడుకొని రాజకీయంగా ఎదిగే దుర్బుద్ధి తమకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Tags:    

Similar News