విశాఖలో సీఎం జగన్ గృహ ప్రవేశం.. ముహూర్తం ఎప్పుడంటే!
విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంకు రాజధాని తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయా? సీఎం క్యాంపు కార్యాలయం ఇప్పటికే సన్నద్ధమవుతుందా? అనుబంధ కార్యాలయాలను సైతం అధికార యంత్రాంగ గుర్తించిందా? అనుబంధ కార్యాలయాలను ఆధునీకరించే పనిలో అధికార యంత్రాంగం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ కేంద్రంగా పరిపాలన ఉంటుందని ప్రకటించారు. విజయదశమి నుంచే విశాఖ నుంచే పరిపాలన మెదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కార్యాలయాలకు సంబంధించి భవనాల ఎంపిక ప్రక్రియ కోసం అవసరమైతే ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రకటన చేశారో లేదో అంతే వైసీపీ ముఖ్య నేతలు, సీఎంవో అధికారలు కార్యాలయాల కోసం విశాఖను జల్లెడ పట్టినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర అనుబంధ విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు సైతం దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఈ అనుబంధ కార్యాలయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనుబంధ కార్యాలయాల్లో కూడా పనులు పూర్తవుతున్నాయని ఈనెల 200 లోపు సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు అనుబంధ విభాగాల కార్యాలయాలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజధాని షిఫ్టింగ్ కోసం సీఎం వైఎస్ జగన్‌తో దసరా ముందు రోజు గృహప్రవేశం చేయించాలని వైసీపీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. అన్నీ సిద్ధమైతే ఈనెల 23న సీఎం జగన్ గృహప్రవేశం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
23న గృహప్రవేశం?
విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే రాజధాని తరలింపునకు మూడు వారాలు మాత్రమే గడువు ఉంది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తొలుత సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ నిర్మిస్తున్న కాంప్లెక్స్‌లోనే సీఎం వైఎస్ జగన్ నివాసం ఉండబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు అనుబంధ శాఖలకు సంబందించిన ఉన్నతాధికారులంతా ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా ప్రకటన చేసింది. రోజులు గడుస్తున్న నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీసు తరలింపును ఉన్నతాధికారులు వేగవంతం చేశారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కన్నబాబు రాజధాని క్యాంపు కార్యాలయం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డిఈసీ ఆధ్వర్యంలో పనులు వేగంగా...నాణ్యతాప్రమాణాలతో జరుగుతున్నాయని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థతుల్లోనూ అక్టోబర్ 23 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 15కల్లా సీఎం క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసి సెక్యూరిటీ విభాగానికి అప్పగించాలని అధికార యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే డిఈసీ సంస్థ ఈనెల 20 లోపు పక్కాగా క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 20కల్లా క్యాంపు కార్యాలయం సిద్ధం అయితే 23న సీఎం వైఎస్ జగన్ గృహప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోజు కూడా ముహూర్తం బాగుండటంతో గృహప్రవేశం చేస్తే బాగుంటుందని నేతలు సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం 24 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేసుకోవచ్చని కూడా సూచించినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు షిఫ్ట అవుతున్న తరుణంలో పోలీస్ యంత్రాంగం సైతం అలర్ట్ అయ్యింది. భద్రతకు సంబంధించిన చర్యలను కూడా అప్పుడే మెుదలు పెట్టేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
అక్టోబరు 23న విశాఖలోని క్యాంపు కార్యాలయంలో గృహ ప్రవేశం చేస్తే బాగుంటుందని సీఎం వైఎస్ జగన్‌కు నేతలు సూచించారు. ముహూర్తం బాగుందని తెలిపారు. అయితే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. ఆలోచిద్దాం అంటూ ఆ విషయాన్ని దాట వేసినట్లు తెలుస్తోంది. విశాఖలో ఏర్పాట్లు కొలిక్కి వచ్చిన తర్వాతనే విశాఖకు వెళ్లే అంశంపై సీఎం జగన్ ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. అక్టోబర్ మెుదటి వారంలోపు ఏర్పాట్లు దాదాపుగా ఓ కొలిక్కి వస్తే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
బీచ్ రోడ్డులోనే అనుబంధ కార్యాలయాలు
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాదు అనుబంధంగా ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్వహణకు 50 ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. అది కూడా విశాఖ బీచ్ రోడ్డులోనే కావడం విశేషం. అద్దెకు తీసుకున్న ఇళ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంటీరియర్ వర్క్స్, దర్వాజాలు, ఇతర ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్లు అధికారయంత్రాంగం వెల్లడించింది. ఇప్పటికే రూ. 8కోట్ల వ్యవయంతోకాంపౌండ్ వాల్, రూ.4కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేసినట్లు తెలిపింది.విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఇదే పనిమీద ఉన్నట్లు తెలుస్తోంది.