ఇటుక దందా.. ఇష్టారాజ్యం! నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు

ప్రజారోగ్య పరిరక్షణకు చట్టాలు ఎన్ని పకడ్బందీగా ఉన్నా అక్రమార్కులు వాటినేమి లెక్క చేయడం లేదు.

Update: 2023-03-25 02:07 GMT

ప్రజారోగ్య పరిరక్షణకు చట్టాలు ఎన్ని పకడ్బందీగా ఉన్నా అక్రమార్కులు వాటినేమి లెక్క చేయడం లేదు. అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటుక బట్టీల వ్యాపారం ‘‘మూడు ఇటుకలు ఆరు బట్టీలు’’ చందానా సాగుతోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన రోడ్లకు పక్కనే బట్టీలు ఏర్పాటు చేయడంతో, వాటి నుంచి పొగ వల్ల వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పక్కనే ఉన్న పంటలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 620కి పైగా ఇటుకల బట్టీలున్నాయి. ఇవన్నీ జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. కొందరు పోరంబోకు భూములను కూడా ఆక్రమించేసి బట్టీలను ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో, ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్ వంటి నియోజకర్గ కేంద్రాల్లో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంది.

బొగ్గు, ప్లాస్టిక్ కవర్ల వినియోగం

శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరు పట్టణ సమీపంలో కురుకుంద, సంగమేశ్వరం వెళ్లే రహదారుల్లో శ్రీ నారాయణ విద్యా విహార్ హైస్కూలుకు సమీపంలో, భవనాశి వాగు పక్కన 8 నుంచి 10 వరకు ఇటుకల బట్టీ తయారీ కేంద్రాలను ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాటు చేశారు. పట్టణ సమీపంలో సంగమేశ్వరం, కురుకుంద గ్రామాలకు వెళ్లే మూల మలుపు వద్ద, భవనాశి వాగును ఆక్రమించి ఇటుకలు తయారు చేస్తున్నారు.

వీటి తయారీకి బియ్యపు పొట్టుకు బదులు బొగ్గు, ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. ఫలితంగా విష వాయువులు వెలువడి సమీపంలోని వెంగళరెడ్డి నగర్, అర్బన్ కాలనీ, ఏరాసు నగర్ వంటి కాలనీల్లో నివాసం ఉంటున్న అనేక మంది రోగాల భారిన పడుతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు, కండ్ల మంటలు, దగ్గు, ఆయాసం వంటి వాటికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు.

ఎక్కడా పాటించని నిబంధనలు

వాస్తవానికి ఇటుకల బట్టీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. జీఓ 80 ప్రకారం నివాసాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులుకు ఒక కిలోమీటర్ దూరంలో ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ర్ట ప్రధాన రహదారులైతే 200 మీటర్లు, గ్రామాల్లో ప్రధాన రహదారులకు 25 మీటర్ల పరిధి దాటి ఇటుకల బట్టీలను ఏర్పాటు చేసుకోవాలి. వాగులు, వంకలు, నదులకు 100 మీటర్ల దూరంలో ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధనలకు ఎక్కడా అమలు చేయడంలేదు.

పంటలపైనా ప్రభావం

పొలాల మధ్యన ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల వాటి కోసం ఉపయోగించే వ్యర్థాలు, పొట్టు, బొగ్గు, ప్లాస్టిక్ వస్తవుల కారణంగా పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏటా రైతులు మొక్కజొన్న, వేరు శనగ పంటల సాగుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేస్తుంటే, దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఇటుకల తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News