బ్రాండ్ ఏపీ.. అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్!

రాష్ట్రంలో దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది.

Update: 2024-11-03 01:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత చేపట్టిన అమెరికా టూర్ జైత్రయాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేశ్ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్ళినా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. లోకేశ్‌లో చంద్రబాబు విజన్‌‌ను చూసిన పారిశ్రామికవేత్తలు బ్రాండ్ ఏపీ మళ్లీ పట్టాలు ఎక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులపై లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలో గుడ్ న్యూస్ చెబుతామని సంకేతాలిచ్చారు. గత అయిదేళ్లుగా కోడిగుడ్డు కథలతో కాలక్షేపం చేసిన పాలకులను చూసిన జనం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన ప్రజాప్రభుత్వం పనితీరుతో బేరీజు వేసుకుంటూ మళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యాన దావోస్‌లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేశ్ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంత్రి లోకేశ్ ఏం చేశారు?

గతనెల 25న అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు 100 మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలుచేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారంరోజులు అవిశ్రాంతంగా సాగించిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో అనుకూలతలు వివరిస్తూ..

గత నెల 29న లాస్ వేగాస్‌లో 23 దేశాల నుంచి 2300 చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్’కు విశిష్టఅతిథిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమంటూ చైతన్యాన్ని నింపారు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చదవడంతోపాటు ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి తాము చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలు, డిజిటల్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను ఆయా కంపెనీల అధినేతలకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై గత అయిదేళ్లుగా నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేష్ కృతకృత్యులయ్యారు.

గత 5 ఏళ్లలో ఏం జరిగింది?..

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో విధ్వంసమే ఎజెండాగా సాగింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాల స్థానంలో కమీషన్ల కోసం వేధించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని భరించలేక 2014-19 నడుమ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ‘కియా’ ఉన్నతాధికారిని నాటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బహిరంగంగానే బెదిరించిన ఘటనను యావత్ ప్రపంచం చూసింది. దీంతో రూ.2వేల కోట్ల విలువైన ‘కియా’ అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ నాటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి కమీషన్ల కోసం బెదిరింపులతో పరారైంది. చంద్రబాబు కష్టపడి ఒప్పించిన లులూ సంస్థ వైసీపీ పాలకుల అరాచకానికి భయపడి వెళ్లిపోయింది. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇటీవలే ఈ సంస్థ మళ్లీ విశాఖకు రావడానికి ముందుకొచ్చింది.

వైసీపీ పాలనలో 30 ఏళ్లు వెనక్కి..

రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షమందికి ఉపాధి కల్పించే అమర్ రాజా బ్యాటరీస్ ను రాజకీయ కక్షతో వేధించడంతో, ఆ సంస్థ లిథియమ్ బ్యాటరీ యూనిట్‌ను తెలంగాణాలో ఏర్పాటుచేసుకున్నారు. రేణిగుంటలో రిలయన్స్ (రూ.15 వేల కోట్లు), విశాఖలో అదానీ డాటా సెంటర్ (రూ.70 వేల కోట్లు), బిఆర్ శెట్టి సంస్థలు (రూ.12 వేల కోట్లు), ఒంగోలులో ఏపీ పేపర్ మిల్స్ (రూ.24వేల కోట్లు) ఏర్పాటుకు కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే, వైసీపీ పాలనలో అవన్నీ వెళ్లిపోయాయి. అయిదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. గత అయిదేళ్ల చీకటిపాలనలో పరిశ్రమదారుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి భరోసా కల్పించడం ద్వారా తిరిగి రాష్ట్రానికి రప్పించే గురుతర బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తలకెత్తుకున్నారు.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆపరేషన్

వాస్తవానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఈ ఏడాది జూన్ 24వతేదీన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ అప్పటినుంచే ఆపరేషన్ ప్రారంభించారు. జగన్ రివర్స్ పాలనలో అయిదేళ్లపాటు రాష్ట్రంవైపు చూడటానికి కూడా భయపడిన పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలుదఫాలుగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) సీఈవో, సీఐఐ ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఇండస్ట్రీస్ కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. విశాఖలో రెండుసార్లు ఎపి ఐటి అసోయేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. మంత్రి లోకేష్ చేపట్టిన చర్యలతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదిరింది.

గంటన్నర భేటీతో.. విశాఖకు టీసీఎస్...

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు భేటీ అయి విశాఖకు టిసిఎస్ రావడానికి ఒప్పించారు. దీనిద్వారా 10వేలమంది ఐటినిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టిసిఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సిటీని ఏర్పాటుచేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్ సిఎల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యాక, మరో 15వే ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిధ్ధమైంది. బ్రాండ్ ఎపి కోసం కేవలం 4నెలల వ్యవధిలో లోకేష్ చేసిన మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలతో పెట్టుబడిదారుల్లో జోష్ నెలకొంది.


Similar News