Botsa: ఉద్యోగులకు మేము వ్యతిరేకం కాదు.. ఆ ఒక్కటి అడగకండి..బొత్స
ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో అట్టుడికిపోతోది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెల పై స్పందించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో అట్టుడికిపోతోది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెల పై స్పందించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ. నిన్న విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయుడు ఇలా ఏ ఉద్యోగైనా తమకు ఒకటేనని చెప్పారు. అంగన్వాడీలు వాళ్లకున్న 11 సమస్యలను తమ ముందుకు తీసుకువచ్చారన్న ఆయన.. వాటిలో 10 సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించామని పేర్కొన్నారు. కాగా జీతాలు పెంచాలి అనే ఒక్క సమస్యను ఇప్పుడు పరిష్కరించలేమని.. ఎన్నికల ముందు జీతాలను పెంచడం సరికాదని భావించినట్లు వెల్లడించారు.
ఇక రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని.. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేస్తామని తెలిపారు. అప్పుడు సామరస్యంగా కూర్చొని చర్చించి మీకు ఏమి కావాలంటే అది చేస్తామని పేర్కొన్నారు. ఆలా కాకుండా ఇప్పుడే చెయ్యాలని.. జీతాలను పెంచాలని పట్టుబట్టడం తప్పు అని తెలిపారు. ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కసారే జీతాలు పెంచుతుందని.. ఇలా రెండు మూడు ఏళ్ళకి ఒకసారి జీతాల పెంపు చూడమనడం ధర్మం కాదన్నారు. ఎంత ఇచ్చినప్పటికీ సరిపోదనటం సరికాదని.. మానవతా దృక్పథంతో ఆలోచన చెయ్యాలని సూచించారు.
తాము ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స పేర్కొన్నారు. అలానే మున్సిపల్ కార్మికులు అడిగినవన్నీ చేశామని ఒకసారి గుర్తుచేసుకోమని సూచించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష, కమ్యునిస్ట్ పార్టీలు చెప్పినట్లు చేస్తూ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లా ఆడటం భావ్యం కాదన్నారు. ప్రజల ఆరోగ్యంతో, ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం తప్పని.. . దీన్ని ప్రజలు హర్షించరని.. కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరాలని సూచించారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు.