జగన్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్: రుషికొండపై లింగమనేని పిటిషన్ డిస్మిస్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ కలిగింది. రుషికొండపై నిర్మాణాలు చేయోద్దు అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ కలిగింది. రుషికొండపై నిర్మాణాలు చేయోద్దు అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ కోణం ఉందని ఈ అంశంపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో విశాఖకు రాజధాని తరలింపు వ్యవహారంలో శరవేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పుకొచ్చు. ఇకపోతే రుషికొండపై నిర్మాణాలు జరగకుండా నిలువరించాలంటూ విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు.జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందున్న కేసులు తేలేవరకు రుషికొండపై నిర్మాణలు, ఇతర అనుబంధ కార్యకలాపాలు సాగకుండా నిలిపివేయాలని లింగమనేని శివరామప్రసాద్ పిల్‌లో కోరారు. అంతేకాదు సీఎం జగన్, ఆయన అధికార బృందానికి విశాఖలో తాత్కాలిక నివాస స్థలాలు గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని లింగమనేని శివరామ ప్రసాద్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిల్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ధాఖలైన లింగమనేని పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారించింది.
రాజకీయ ప్రేరేపితం
ఇకపోతే రుషికొండ కట్టడాలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ లింగమనేని శివరామ ప్రసాద్‌కు సూచించింది.అంతేకాదు ఈ పిటీషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని అభిప్రాయపడింది. ఈకేసును హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది.అనంతరం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.