వెయ్యి ఆవుల్నిస్తా.. ఏపీ సీఎంకు బీసీవై పార్టీ అధ్యక్షుడు లేఖ

తిరుమలలో స్వామివారి ధూప, దీప, నైవేద్యాలకు కావలసిన నెయ్యిని సొంతంగా డెయిరీ పెట్టి తయారు చేయవచ్చని పేర్కొంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అందుకు తాను 1000 ఆవుల్ని ఇస్తానని తెలిపారు.

Update: 2024-10-06 03:40 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న వివాదం ఇంకా ముగియలేదు. దీనిపై ఇటీవలే సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోళ్లను ఆపేసిన టీటీడీ.. ప్రస్తుతం నందిని నెయ్యినే లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తోంది. ఈ క్రమంలో భారత చైతన్య యువజన పార్టీ(BCY) జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సీఎం చంద్రబాబునాయుడికి ఓ లేఖ రాశారు. వెయ్యి ఆవుల్నిస్తా.. టీటీడీకి సొంత డెయిరీని (TTD Dairy) పెట్టి.. ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాల తయారీకి వాడాలనేది ఆ లేఖ సారాంశం.

తిరుమలలో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకూ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. సగటున రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ రోజువారీ ఆదాయం ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రంలో సొంత డెయిరీ ఎందుకు పెట్టుకోకూడదు? తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటుకు ప్రభుత్వం రెడీగా ఉంటే.. తన వంతు బాధ్యతగా వెయ్యి ఆవులను ఇస్తానన్నారు రామచంద్రయాదవ్(Ramachandra Yadav). అంతేకాదు.. మరో లక్ష ఆవుల్ని ఫ్రీ గా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తీసుకుంటానన్నారు. రోజుకు లక్ష ఆవుల నుంచి 10 లక్షల లీటర్ల ఆవుపాలు ఉత్పత్తవుతాయి. వాటి నుంచి 50 వేల కేజీల వెన్న తీసినా.. సుమారు 30 వేల కేజీల నెయ్యి తయారవుతుంది. ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప, నైవేద్యాలకు వాడి.. మిగిలిన దాన్ని రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు కూడా పంపవచ్చన్నారు. ఇలా చేస్తే లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని లేఖలో పేర్కొన్నారు. అలాగే టీటీడీ పాలకమండలిలో రాజకీయ, వ్యాపార, కార్పొరేట్ వ్యక్తులు కాకుండా.. ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు వంటి వారు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 


Similar News