బీ అలర్ట్: ఆ పథకం అమల్లో కీలక మార్పులు..లబ్ధిదారులకు జగన్ సర్కార్ కీలక సూచనలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలతోపాటు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలతోపాటు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో జగనన్న విద్యాదీవెన పథకం ఒకటి. ఈనెల 28న ఈ పథకం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం లబ్దిదారులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు జగనన్న విద్యాదీవెన పథకం నిధులు తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం ఈ నిబంధనలో కీలక మార్పులు చేసింది. ఇకపై నుంచి విద్యార్ది - తల్లి కలిపి జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించాలని సూచించింది. బ్యాంకుల్లో తెరిచే ఖాతాల్లో ప్రాధమిక ఖాతాదారుగా విద్యార్ధి..రెండో ఖాతాదారుగా తల్లి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.అయితే ఈ అకౌంట్‌కి ఎలాంటి డెబిట్ కార్డు ఉండదని...నేరుగా బ్యాంకు నుంచి తల్లి, విద్యార్థి ఇద్దరు సంతకం పెడితేనే అమౌంట్ డ్రా చేసేలా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. తల్లిలేని వారు తండ్రి, తల్లిదండ్రులు లేకపోతే వారి గార్డియన్‌తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇలా ఓపెన్ చేసిన ఖాతాలను ఈనెల 24లోపు అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈనెల 28న సీఎం వైఎస్ జగన్ ఈ పథకం నిధులు వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈలోపు జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలని సూచించింది.
సచివాలయ సిబ్బందికి కీలక మార్గదర్శకాలు
జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల విషయమై గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక మార్గదర్శకాలు అందాయి. జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేయించాల్సిన బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. ప్రతీ బ్యాంకు బ్రాంచి పని దినాల్లో కనీసం వంద జాయింట్ అకౌంట్‌లు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జాయింట్ అకౌంట్ డిటైల్స్‌ను పొందుపరిచిన బాధ్యత సైతం గ్రామ వార్డు సచివాలయాలకు అందజేసింది. ఈ ప్రక్రియను ఈనెల 24లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. అనంతరం ఈనెల 28న సీఎం వైఎస్ జగన్ విడుదల చేసే నిధులు కొత్త జాయింట్ అకౌంట్‌లలో వేయనున్నట్లు తెలుస్తోంది.