ప్రజలారా అప్రమత్తంగా ఉండండి....మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: ప్రభుత్వం హెచ్చరిక

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

Update: 2023-12-03 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారానికి కోస్తా తీరానికి సమాంతరంగా తుపాను పయనించనున్నట్లు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారంలలో కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం ఉదయం తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండండి

రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం తుపాను గమనంపై సమీక్ష నిర్వహించారు. విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోడానికి యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలకోసం 4ఎన్డీఆర్ఎఫ్ , 6ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు తుపాను హెచ్చరిక మెసేజ్‌లు పంపినట్లు వెల్లడించారు. ప్రజలు అత్యవసర సహయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. 

Tags:    

Similar News