బీసీ మంత్రం.. మావైపే అంటున్న మూడు పార్టీలు

ప్రధాన పార్టీల బీసీ జపం ప్రభావం గోదావరి జిల్లాలపై పడింది.

Update: 2022-12-19 03:12 GMT

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి : ప్రధాన పార్టీల బీసీ జపం ప్రభావం గోదావరి జిల్లాలపై పడింది. బీసీలు మాకు వెన్నెముక అని వైసీపీ అంటుంది. మేము కార్పొరేషన్లు ఇచ్చి బీసీలకు సముచితమైన స్థానం కల్పించామని పార్టీ పెద్దలు అంటున్నారు. టీడీపీ అయితే ఈ విషయంలో నియోజకవర్గాలవారీగా బీసీల గర్జనలు నిర్వహిస్తున్నది. జనసేన కూడా ఇదే విషయమై కసరత్తు చేస్తుంది. వైసీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇటీవల విజయవాడలో నిర్వహించిన బీసీ గర్జనలో చక్కని పాత్ర పోషించి, పార్టీ పెద్దల నుంచి మార్కులను కొట్టేశారు. టీడీపీలో పిఠాపురం మాజీ శాసన సభ్యుడు వర్మ జనవరిలో భారీ ఎత్తున నిర్వహించే బీసీ సదస్సుకు పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. మాజీ శాసనసభ్యుడు పిల్లి సత్యనారాయణమూర్తి స్వతహాగా బీసీ.. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మరా బాబు అనే కార్యక్రమంలో తమకు చంద్రబాబు గతంలో ఏం చేశారో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిశ ప్రత్యేక కథనం..

బీసీలే వెన్ముముక

బీసీలే మాకు వెన్నుముక అని టీడీపీ నేతలు అంటున్నారు. తమ హయాంలో బీసీలకు ఆదరణ వంటి పథకాలను ఇచ్చి, కులవృత్తుల వారిని ప్రత్యేకంగా ఆదుకొన్నామని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి రుణాలను ఇచ్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు ఇచ్చామని పేర్కొంటున్నారు. ముమ్మడివరం మాజీ శాసన సభ్యుడు దాట్ల బుచ్చిరాజు కూడా ఇటీవల బీసీ వాడల్లో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు పెట్టిందని వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అని ప్రశ్నించారు. కార్పొరేషన్ చైర్మన్లకు కనీసం గౌరవ వేతనం కూడా లేదని తెలిపారు.

వైసీపీది సేమ్ డైలాగ్

వైసీపీ కూడా ఇటీవల విజయవాడలో బీసీ గర్జన నిర్వహించింది. ఇందులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తన దైన శైలిలో తీవ్రమైన కృషి చేశారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా తనదైన శైలిలో కష్ట పడుతున్నారు.

జనసేన కూడా.. గేర్ మార్చి..

జనసేన కూడా పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉండి, గోదావరి జిల్లాల్లో అధికంగా సీట్లు బీసీలకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంతేగాక బీసీలు, ఓసీలను ఏకం చేసేందుకు జనసేన నేతలు కృషి చేస్తున్నారు. నిజంగా బీసీలు ఎవరికి మొగ్గు చూపుతారో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News