Good News: ఏపీలో 1000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఖాళీల భర్తీపై ఏపీపీఎస్సీ తుది నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నివేదికను సైతం ప్రభుత్వానికి పంపింది. దీంతో భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం పెరగడంతో గ్రూప్-1, గ్రూప్-2లో ఉన్న ఖాళీల భర్తీకి సీఎం జగన్ కూడా పచ్చ జెండా ఊపేశారు. దీంతో ఈ ఖాళీలను త్వరగా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఖాళీలను భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు ఆందోళనను చేపట్టాయి. అటు నిరుద్యోగుల సైతం ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొందరు నిరుద్యోగులు సైతం అరెస్ట్ అయ్యారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోడంతో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన పార్టీకి ఓట్లు వేయలేదు. డబ్బులు పంపిణీ చేసినా సరే ప్రలోభాలకు లొంగలేదు. తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చాలా క్లారిటీగా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన మూడు స్థానాల్లోనూ టీడీపీకే పట్టంకట్టారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1,2 లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయించడంతో త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.