జిల్లాల పునర్విభజనపై భిన్నస్వరాలు.. జగన్ సర్కార్ ప్లాన్ ఏంటి?
దిశ, ఉత్తరాంధ్ర: జిల్లాల పునర్విభజనపై కొద్దిరోజులుగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోటా అనుకూల, ప్రతికూల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాలోనూ పెద్దఎత్తు
దిశ, ఉత్తరాంధ్ర: జిల్లాల పునర్విభజనపై కొద్దిరోజులుగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోటా అనుకూల, ప్రతికూల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాలోనూ పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. విజయనగరం జిల్లాను రెండు జిల్లాలుగా విభజనకు ప్రభుత్వం ఆమోదించింది. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం ఉన్నాయి. విజయనగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి నియోజకవర్గాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గంతో కలిపి విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. మిగతా పార్వతీపురం, సాలూరు, కురుపాం కలుపుకుని శ్రీకాకుళంలో ఉన్న పాలకొండ నియోజకవర్గంతో మన్యం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. తమ ప్రాంతాలను పక్క జిల్లాలో కలపొద్దని, మరికొన్ని ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని నిరసనలు తెలుపుతున్నారు.
పార్వతీపురం రెవెన్యూ డివిజన్ .. మన్యం జిల్లా ..
ప్రస్తుతం ఉన్న విజయనగరం జిల్లాలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ను మన్యం జిల్లాగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండను కలుపుతూ సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలతో మన్యం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. వీటిని మన్యం జిల్లాగా కొనసాగిస్తూనే పార్వతీపురం ఐటీడీఏను తరలించొద్దని డిమాండ్ కూడా చేస్తున్నారు.
కొనసాగించాలని.. కొనసాగించొద్దని....
మన్యం జిల్లాకు పేరును మార్చాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్వతీపురం పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాగా పేరు పెట్టడంతో రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతామని స్థానిక బీసీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు తమ గిరిజనులను జగన్ గుర్తించి మన్యం పేరుగా నామకరణం చేశారని అదే పేరును కొనసాగించాలని వారూ కోరుతున్నారు. గిరిజన జిల్లాగా ఏర్పాటైతే తమకు అవకాశాలు పెరుగుతాయని, నిధులూ వస్తాయని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
మెంటాడను విజయనగరంలో ఉంచాలని డిమాండ్
సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ ఉంది. మెంటాడ మండల పరిధిలోని 31 గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తమను మన్యం జిల్లాలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం అయితే 15 కి.మీ దూరం వస్తుందని, అదే పార్వతీపురం అయితే 90 కి.మీ దూరం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని విధాలుగా విజయనగరం జిల్లాయే అనుకూలంగా ఉంటుందని, తమను విజయనగరం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్.. డిమాండ్
చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సొంత నియోజకవర్గాన్ని కనీసం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించలేకపోతున్నారని నాయకులపై మండిపడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఏ పరిస్థితుల్లోనూ చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
శృంగవరవుకోట నియోజకవర్గం.. విశాఖలో విలీనం...
శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖలో విలీనం చేయాలని నియోజకవర్గ ప్రజలందరూ నిరసనలు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా ఈ నిరసనలు తెలుపుతున్నారు. విజయనగరం జిల్లా నాయకుల రాజకీయ కోసమే తమను విశాఖలో విలీనం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా విశాఖ అందుబాటులో ఉందని ఎన్నో ఏళ్లుగా విశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా తమ న్యాయ పరమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4 వేలకుపైగా వినతులు
తమ ప్రాంతాలను వేరే జిల్లాల్లో విలీనం చేయాలని, మరికొన్ని ప్రాంతాలను ఆయా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా 4 వేలకు పైగా వినతులను జిల్లావాసులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విజయనగరం జిల్లా నుంచి 4 వేలకు పైగా వినతులు రావడంతో జిల్లా పునర్విభజనపై మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా నుంచీ ఇన్ని వినతులు వెళ్లలేదని ఒక్క విజయనగరం జిల్లా నుంచే వేలల్లో వినతలు వెళ్లాయని జిల్లావాసులు తెలిపారు.