అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు

Update: 2024-09-08 15:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏలేరు రిజర్వాయర్ (Yeleru Reservoir)కి జల ప్రవాహం పెరుగుతుండటంతో పాటు భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు మిగిలిన అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) టెలికాన్ఫరెన్స్ (Tele Conference) నిర్వహించారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్కి ఇప్పటికే 21 టీఎంసీలకు చేరిన క్రమంలో ఒకవేళ ఏలేరులో ఉధృతి పెరిగి వరదలు వస్తే ముంపు గ్రామాలు ఏ స్థాయిలో ప్రభావితం అవుతాయి..? నష్టాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా ఆయన ఈ సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఇప్పటికే భారీ వర్షాలు చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయిన సహాయక చర్యలు అందించాలని సూచించారు.

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎంకి కాకినాడ జిల్లా కలెక్టర్ (Kakinada District Collector) పరిస్థితిని వివరించారు. ఏలేరు రిజర్వాయర్కి ఇన్ ఫ్లో ఉదయం 4 వేలు క్యూసెక్కులు ఉంటే, సాయంత్రానికి 8 వేలు క్యూసెక్కులు ఉందని, రాత్రికి 10 వేల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency)లో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని, అక్కడి అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. కాగా.. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ కాకినాడ‌లో పర్యటించి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్నారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజకవర్గంలో ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారని సమాచారం.


Similar News