Ap Congressలో కుదుపు.. హర్ష కుమార్ అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కుదుపు చోటు చేసుకుంది. ఏఐసీసీ నూతనంగా ప్రకటించిన కమిటీలపై పార్టీ కీలక నేత అసంతృప్తి వ్యక్తం చేశారు...

Update: 2022-11-24 10:17 GMT
  • ప్రచార కమిటీ పదవిని తిరస్కరించిన మాజీ ఎంపీ హర్ష కుమార్
  • అగ్రవర్ణాల వారికి ఇచ్చుకోవాలంటూ ఉచిత సలహా

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కుదుపు చోటు చేసుకుంది. ఏఐసీసీ నూతనంగా ప్రకటించిన కమిటీలపై పార్టీ కీలక నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ కేటాయించిన కీలకమైన పదవిని తిరస్కరించారు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానానికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. తిరస్కరణ లేఖను సైతం ఈమెయిల్ చేశారు. అలాగే రాష్ట్రంలో అన్ని పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులనే అధ్యక్షులుగా నియమించిందని లేఖలో గుర్తు చేశారు. ఇక ప్రచార కమిటీ చైర్మన్ పదవి కూడా అగ్రవర్ణాల వారికే ఇస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని సెటైర్లు వేస్తూ లేఖను పంపించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనకు ఇచ్చిన పదవిని తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి హర్షకుమార్ పీసీసీ చీఫ్ పదవి ఆశించారని, అది దక్కకపోవడంతో ప్రచార కమిటీ చైర్మన్ పదవిని తిరస్కరించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

భంగపడినందుకేనా?

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎంపీ స్థాయికి ఎదిగారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటూ మరికొన్ని విభాగాల్లో పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. జీవీ హర్షకుమార్, ఆయన తనయుడు 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరారు. అమలాపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే గత కొంతకాలంగా ఏపీసీసీలో మార్పులు జరుగాయని ప్రచారం జరిగింది. దీంతో ఏపీసీసీ చీఫ్ పదవి తనకు వరిస్తుందని ఆశించారు.

అయితే అనూహ్యంగా అధిష్టానం గిడుగు రుద్రరాజుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఏపీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా జంగా గౌతం, సుంకర పద్మశ్రీ, మస్తాన్‌వలీ, రాకేష్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌‌, మీడియా, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా ఎన్‌.తులసిరెడ్డిలను అధిష్టానం నియమించింది. అలాగే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజును నియమించింది. వీటితోపాటు 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా అధిష్టానం ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజుతో పాటూ రాష్ట్ర ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ, మెయ్యప్పన్‌, క్రిస్టోఫర్‌ తిలక్‌, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్‌, పళ్లంరాజు, టి.సుబ్బరామిరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌, హర్షకుమార్‌, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కె.రాజు, మస్తాన్‌వలీ, సిరివెల్ల ప్రసాద్‌, ఉషానాయుడులు రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు 33 మందితో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

హర్షకుమార్ లేఖ సారాంశమిదే

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని తిరస్కరిస్తూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి ఈ మెయిల్ చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి తనకు అవసరం లేదని.. ఇకపై తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ లేఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీల అధ్యక్షులు, సామాజిక సమీకరణాల అంశాలను లేఖలో వివరించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అగ్రకులాల వారే అధ్యక్షులుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పయనిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ - రెడ్డి, టీడీపీ - కమ్మ, జనసేన - కాపు, బీజేపీ - కాపు, సీపీఎం- రెడ్డి, సీపీఐ - బి.సి, ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి బ్రాహ్మణ వర్గానికి ఇచ్చిందని లేఖలో వివరించారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అగ్రవర్ణాల వారికి ఇస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News