AP CM: దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి దయతో అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2024-10-09 11:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి దయతో అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మూలా నక్షత్రం విజయవాడ దుర్గమ్మ జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అమ్మవారి జన్మదినమైన మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, లక్షల మంది భక్తులు ఎంతో నమ్మకంతో దుర్గమ్మను దర్శించుకుంటున్నారని తెలిపారు.

దసరా సందర్భంగా ప్రభుత్వం తరుపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించామని, చెడుని జయించటమే కాక, మంచి పనులను ఆశీర్వదించాలని దుర్గమ్మను కోరుకున్నానని, నా ప్రార్థనలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి తర్వాత అన్నింట్లో రెండో అతి పెద్ద దేవాలయంగా నిలుస్తుందని, అలాగే దుర్గమ్మను కొలిస్తే.. విజయం తప్పక వరిస్తుందని భక్తులు నమ్ముతారని అన్నారు. అలాగే దేవాలయాల్లో పవిత్రతను అందరం కాపాడుకొని, ఆధ్యాత్మిక స్పూర్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు ఉత్సవ కమిటీ ఉండేదని ఇప్పుడు కొత్తగా సేవా కమిటీని ఏర్పాటు చేశామని, దాని ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారని, క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాట్లు చేశారని, దుర్గగుడి పాలకమండలి సభ్యులకు అభినందనలు తెలిపారు.

అలాగే దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని, దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారని, వారిని అభినందిస్తున్నానని అన్నారు. దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయని, ఎప్పుడు చూడని కృష్టమ్మ పొంగి పొర్లిందని అన్నారు. ఇదేవిధంగా అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలని, అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి అవ్వాలని, రాష్ట్ర ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా.. వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం, ఉచిత లడ్డూ కూడా కల్పించారని, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయని, ప్రతి దేవాలయానికి, ప్రార్ధనా మందిరానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు.

Similar News