కాసేపట్లో కుప్పంకు చంద్రబాబు.. రెండు రోజుల పాటు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో కుప్పంకు వెళ్లనున్నారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Ap Cm Chandrababu) కాసేపట్లో కుప్పంకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అమరావతి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.00 గంటలకు కుప్పానికి చేరుకుంటారు. అనంతరం స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్(Swarna Kuppam Vision 2029 Document)ను ద్రవిడ యూనివర్శిటీలో ఆయన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కుప్పం మండలం నడిమూరు గ్రామానికి వెళ్తారు. అక్కడ గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ప్రకృతి సేద్యంపై రైతులతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అవుతారు.
ఈ రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. మంగళవారం ఉదయం 10.00 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం రాత్రికి కుప్పం ఆర్‌అం బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఇక 8వ తేదీ ఉదయం విశాఖపట్నం(Vishakapatnam)కు వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi) పర్యటనలో పాల్గొంటారు. ప్రధానితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.