AP CID: అన్ని ఆధారాలు సేకరించాకే బాబు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్టు ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ చెప్పారు..
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్టు ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ చెప్పారు. అరెస్ట్‌లో అన్ని మార్గదర్శకాలు పాటించామన్నారు. ఈ స్కాంలో మొత్తం 371 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి బీజం పడినట్టు అదనపు డీజీ సంజయ్ చెప్పారు. జీవో జారీ చెయ్యక ముందే స్కిల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరిగిందని తెలిపారు. అగ్రిమెంట్లో జీవో నెంబర్ చూపించలేదని చెప్పారు. ఇక జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్లో లేవని తెలియచేశారు. అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంస్థ తన వాటాగా 3వేల కోట్ల పెట్టుబడులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా పెడతానని పేర్కొందన్నారు. ఆ సంస్థ పెట్టుబడులు పెట్టక ముందే అప్పటి ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిందని వివరించారు. దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఒప్పందం జరిగిందని తెలిపారు. జీవోకంటే ముందే అగ్రిమెంట్ తయారయ్యిందని తమ విచారణలో స్పష్టం అయ్యిందని చెప్పారు. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టుగా వెళ్లడయ్యిందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటులో కూడా ఎలాంటి విధివిధానాలను పాటించలేదని స్పష్టం అయినట్టు చెప్పారు. కార్పొరేషన్ నుంచి ప్రైవేట్ వ్యక్తులకు నిధులు వెళ్లాయని, వారి నుంచి షెల్ కంపెనీలకు చేరాయని వివరించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసినట్టు తెలిపారు. ఇదే కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు చేసిన ఈడీ 70 కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించిందని చెప్పారు. ఈడీ అధికారులు 31కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీజ్ కూడా చేశారన్నారు. ఈ స్కాంలో ఆధారాలు సేకరించాకే చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దీంట్లో లోకేష్ పాత్రపై కూడా విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
స్కిల్ ఫుల్ స్కాం..
స్కిల్ ఫుల్‌గా చేసిన స్కాం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలివిగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్టు వ్యాఖ్యానించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఏజీ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో యువకులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వటానికి పూర్తి ఉచితంగా 3,300 కొట్లు పెట్టుబడిగా పెట్టటానికి ముందుకొచ్చినట్టు అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు.10 శాతం వాటాగా ప్రభుత్వం 371 కొట్లు ఇస్తే చాలని తెలిపిందన్నారు. ఆ తర్వాత డిజైన్ టెక్ సంస్థకు 371 కోట్ల రూపాయలను చెల్లించినట్టు చెప్పారు. దీనిపై అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. పూణేలో మొదటిసారి జీఎస్టీ అధికారులు దీనిని గుర్తించి అప్పటి ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు చెప్పారు. 2018, మే 18వ తేదీన అప్పటి ఏసీబీ డీజీకి కూడా లేఖ పంపించారని తెలిపారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వీటిని పక్కన పెట్టేసినట్టు వివరించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగగా తాను దర్యాప్తు అధికారిని కాదని సుదర్శన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తన వద్ద ఉన్న పత్రాలు, వివరాలను మాత్రమే వెల్లడిస్తున్నట్టు పేర్కొన్నారు.
More News : ఢిల్లీకి నారా లోకేశ్.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్