జగన్‌కు బీజేపీ అండ అనేది అపోహమాత్రమే: Daggubati Purandeswari
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. అధికారికంగా చేసే అప్పులకు తోడు అనధికారిక మార్గాల ద్వారా కూడా భారీ మొత్తంలో అప్పులు చేస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా, అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర విభజన నాటికి రూ.97వేల కోట్ల భారం ఉందన్న ఆమె ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆ అప్పులు రూ.2,65,365 కోట్లకు చేరగా వైసీపీ పాలనలో రూ.7,14,631 కోట్లకు చేరిందన్నారు. ఈ అప్పుల్లో రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అనధికార అప్పులే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారిందని ఆరోపించారు. ఉద్యోగులను తాకట్టు పెట్టి, ప్రభుత్వ సంస్థలను పెట్టి అప్పులు చేశారని అక్కడితో ఆగక లిక్కర్ బాండ్స్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చారని విమర్శించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ నిధులను సైతం మళ్లించారని మండిపడ్డారు. స్టేట్ డిజార్డర్స్ ఫండ్ కూడా మళ్లించేశారని విరుచుకుపడ్డారు.సింకింగ్ ఫండ్‌ను కూడా వదిలిపెట్టకుండా దోచేశారని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల పీఏఫ్ నుంచి, ఈ.యస్.ఐ నుంచి, జనరల్ పీఎఫ్ నుంచి ఇలా అనేక మార్గాల్లో అనధికారికంగా రూ. 4,74,315 కోట్లు తెచ్చారని మండిపడ్డారు. తీసుకున్న అప్పులకు రూ.50వేల కోట్లు వడ్డీ కింద కడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 40 శాతం వడ్డీలు చెల్లించడానికే ఖర్చు చేయాల్సి వస్తే ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా చేయగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. అనధికారికంగా తీసుకువస్తున్న అప్పులపై వైఎస్ జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
అధికారిక అప్పు వరకే కేంద్రం బాధ్యత
బీజేపీ ప్రభుత్వం జగన్‌కు అండగా ఉందనేది అపోహ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అధికారికంగా తీసుకున్న అప్పుల వరకే కేంద్రం బాధ్యత వహిస్తుందని..అనధికార అప్పులకు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అంశాలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరిస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మరోవైపు పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని వెల్లడించారు. జనసేన మా మిత్రపక్షం..ఫోన్లో పవన్ కల్యాణ్‌తో మాట్లాడాను. త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటామని దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు.