RESULTS: పశ్చిమ రాయలసీమలో "దేశం"కే పట్టభద్రుల పట్టం

తెలుగుదేశం పార్టీకే పట్టభద్రులు పట్టం కట్టారు..

Update: 2023-03-18 15:20 GMT
  • రామగోపాల్ రెడ్డి విజయకేతనం
  • పులివెందుల నుంచే బరిలో దిగిన విజేత
  • ఉత్కంఠ పోరులో వైసీపీ మద్దతు అభ్యర్థి పరాజయం.
  • షాక్‌లో వైసీపీ..జోష్‌లో దేశం

దిశ, కడప: తెలుగుదేశం పార్టీకే పట్టభద్రులు పట్టం కట్టారు. ఉత్కంఠ పోరులో ఆ పార్టీ మద్దతుదారుడు ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం శ్రేణుల్లో ఈ విజయం జోష్ నింపగా, వైసీపీ శ్రేణులను షాక్‌లో ముంచింది. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించుకోవాలన్న పట్టుదలతో పశ్చిమ పట్టబద్ధుల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాటిని చిత్తు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతూ పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపుతుంది .అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పులివెందుల నుంచే తెలుగుదేశం మద్దతుదారుడిగా బరిలో దిగిన రామగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం పులివెందుల రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అన్న చర్చలకు తావునిస్తోంది.

సాదా‌సీదాగా బరిలో దిగి

పట్టభద్రుల ఎన్నికల్లో సాదాసీదాగా బరిలో దిగారు రామగోపాల్‌రెడ్డి. హంగులు, ఆర్భాటాలు లేకుండా మూడు నెలల ముందు నుంచే పట్టభద్రులను, పార్టీ నాయకులను కలుస్తూ వారి మద్దతు పొందుతూ ఎన్నికల ప్రచారానికి దిగారు. పులివెందుల నియోజవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన రామగోపాల్‌రెడ్డి పట్టభద్రుల తెలుగుదేశం మద్దతు అభ్యర్థిగా బరిలో దిగడాన్ని అధికార వైసీపీ మొదట్లో పెద్దగా పట్టించుకున్నట్లు కానరాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడం నుంచి పోలింగ్ సమీపించే సమయానికి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీకి వచ్చింది. ఆ పార్టీ మద్దతు అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి ఎన్నికల్లో దూసుకెళ్లే పరిస్థితి కనిపించడంతో వైసీపీ పోలింగ్‌కు వారం రోజుల ముందు అలెర్ట్ అయింది. అదే సమయంలో పార్టీ నాయకులను ప్రచారానికి సమాయత్తం చేసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా చేయడం జరిగింది. వైసీపీ డబ్బు పంపిణీ చేయడానికి సమాయత్తమైనప్పుడే ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుందని ఎదురొడ్డి పోరాడే పరిస్థితి కనిపిస్తున్నాయని అర్థమైనట్లు చెప్పుకోవాలి. దీంతో ఆపార్టీ శ్రేణులంతా గట్టి ప్రయత్నం చేశారు. పోలింగ్ రోజు గ్రామ, డివిజన్ స్థాయి నుంచి నాయకులు బాగా కష్ఠపడ్డారు. వీరి ప్రయత్నాలు, పోలింగ్ మేనేజ్‌మెంట్ చూసిన వారికి వైసీపీదే విజయం కావచ్చన్న అంచనాలు కనిపించాయి.


అయినా కూడా ఓటరు మాత్రం తన నిర్ణయాన్ని సారం ఓటు వేశారు. వైసీపీ ఇంతగట్టి ప్రయత్నం చేసినా కూడా ఓటమి పాలయ్యిందంటే ప్రభుత్వంపై పట్టభద్రులుగా ఉన్న ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ మద్దతు ఇచ్చిన వెన్నపూస రవీంద్రారెడ్డికి గట్టి పోటీ ఉందని భావించారు. ఆయన గెలుపుపై పలు వర్గాల్లో సందేహాలు కూడా పోలింగ్ ముందు వ్యక్తమయ్యాయి. అయితే పట్టధ్రులు వైసీపీ అభ్యర్థి మాత్రం గెలుపు ఖాయం అన్న ధీమా ఆ పార్టీతో పాటు పలువురు భావించారు. అయితే కౌంటింగ్‌లో మొదట్లో వైసీపీ మద్దతుదారుడు వెన్నపూస రవీంద్రారెడ్డికి కొంత మెరుగ్గా అనిపించినా ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ జరుగుతూ ఉత్కంఠకు గురిచేసింది. మొదటి ప్రాధాన్యం ఓటు గెలుపును నిర్ణయించే స్థాయిలో లేక పోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్లు రామగోపాల్ రెడ్డిని విజేతగా నిలిపాయి. రామగోపాల్ రెడ్డి సాదాసీదాగా కనిపించినా ఓట్లను కూడకట్టుకోవడం, పీడీఎఫ్ అభ్యర్ధితో వ్యూహాత్మకంగా వ్యవహరించడం లాంటివి ఆయనకు బాగా సహకరించాయి. ఇవన్నీ కలిసి రావడం ఆయన్ను పట్టభద్రులు ప్రధాన నిలబెట్టారు

దేశంలో జోష్

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల మండలి ఎన్నికల్లో రామగోపాల్ రెడ్డి గెలుపు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపింది. జగన్ పార్టీ ఆవిర్భావం 2012 నుంచి జిల్లాలో ఆ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా విజయ అవకాశాలు భారీగా దక్కుతూ వచ్చాయి. గత సాధారణ ఎన్నికల్లో మొత్తం పది అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ ఏడాదిన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని ఆధిక్యతను సాధించుకుంది. ఇలా విజయగర్వంతో ముందుకు సాగుతున్న ఆ పార్టీకి పట్టభద్రుల మండలి ఎన్నికలు షాక్‌లో ముంచాయి. ఇదే తరుణంలో గత ఎన్నికల్లో సరైన ఫలితాలు రాక నిరాశ పడ్డ తెలుగుదేశం శ్రేణులకు ఈ ఎన్నికలు టానిక్‌లా పనిచేశాయి . దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కనిపించిన ఫలితాలు వైసీపీకి దూకుడుకు బ్రేకులు పడతాయి అన్న భావన కనిపిస్తోంది. మరి మరో ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సెమీ ఫైనల్స్‌గాతో భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీ ఎలా పరిగణించి ముందుకు సాగుతుందో చూడాలి. 

Tags:    

Similar News