Ap News: రోడ్ల సమస్యపై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన ఎమ్మెల్యే

ఏపీలో రోడ్ల పరిష్కారంపై ప్రజలకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దిమ్మతిరిగే సమాధాన చెప్పారు...

Update: 2023-11-24 14:12 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోడ్డు బాగోలేవని ఇటీవల ప్రతిపక్ష నాయకులు ఆందోళన కార్యాక్రమాలు నిర్వహించారు. అయినా సరే అధికార పార్టీ నేతల్లో స్పందన లేదు. దీంతో  రోడ్ల సమస్యలపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చిన్నరామన్నగారి పల్లి వాసులు తీసుకెళ్లారు. అయితే ఆయన చెప్పిన సమాధానానికి వారంతా ఒక్కసారిగా  షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గంలో ప్రతి నెల రూ.15 కోట్లు ఫించన్లకే సరిపోతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేయాలంటే వాటిని రద్దు చేయాలని చెప్పారు. అలా చేస్తే రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో గ్రామస్తులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

అయితే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పిన సమాధానంపై మాత్రం గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇచ్చాయని, ఇప్పుడు మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  చిన్నరామన్న గారిపల్లిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, తమ గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన సమాధానం బోడిగుండుకి, మోకాలికి ముడి వేసినట్లుందని గ్రామస్తులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు కచ్చితంగా బుద్ది చెబుతామని  చిన్నరామన్నగారి పల్లి వాసులు హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News