చంద్రబాబును ఎలా నమ్మారు.. పవన్‌కు మహిళా మంత్రి సూటి ప్రశ్న
ఏపీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి....
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్న జనసేనాని సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చారు. పొత్తుల్లో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తారనుకుంటే.. ఎవరికి వారే రెండు సీట్లను ప్రకటించేకున్నారు. రాజోలు, రాజానగరం సీట్లకు తమ అభ్యర్థులను పవన్ ప్రకటించారు. అటు మండపేట, అరకు అభ్యర్థులను ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. దీంతో ఆ రెండు పార్టీలను వైసీపీ టార్గెట్ చేసింది. చంద్రబాబుకు ఎలాంటి ధర్మం తెలియదని.. అలాంటి ఆయన్ను పవన్ కల్యాణ్ ఎలా నమ్మరని ప్రశ్నలు కురిపిస్తున్నారు.
చంద్రబాబు, పవన్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి ఉషాశ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత మేనమామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఎలా నమ్మారని పవన్ కల్యాణ్‌ను మంత్రి ఉషాశ్రీ చరణ్ ప్రశ్నించారు. పొత్తు ధర్మం టీడీపీ ఉల్లంఘించిందన్న పవన్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపం పవన్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని ఉషాశ్రీ చరణ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చూపించింది ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ఇంకా చాలా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఓటు బ్యాంకును వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఉషాశ్రీ చరణ్ ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
వైఎస్ షర్మిలపై ఆగ్రహం
అటు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలపైనా ఉషాశ్రీచరణ్ విమర్శలు కురిపించారు. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టును షర్మిల చదివారని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయినా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారని.. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎలా చేరారని మంత్రి ఉషాశ్రీ చరణ్ ప్రశ్నించారు.