AP News:ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్ ఆపై హత్య

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి(62) హత్యకు గురయ్యారు.

Update: 2024-10-09 01:57 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణ కుమారి(62) హత్యకు గురయ్యారు. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌కు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాత పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాలిలా ఉన్నాయి.

29న స్వామి వద్దకు వెళ్లి..

ధర్మవరం వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని వైఎస్‌ జగన్‌ కాలనీలో ఒంటరిగా నివాసముండేది. గత నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై పుంగనూరు రోడ్డులో ఉన్న స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లింది. ఇదే అదనుగా స్వర్ణకుమారిని వెంకటేశ్‌ కిడ్నాప్‌ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లె టూటౌన్‌ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. అదే సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్‌ చేయగా కాల్‌ ఫార్వర్డ్‌ అనే వాయిస్‌ వినిపించింది. ఆ రోజు సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో దైవభక్తి ఎక్కువగా ఉండడంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని ఆమె భావించింది.

పెన్షన్ తీసుకోవడానికి రాకపోవడంతో..

అక్టోబర్‌ 1వ తేదీన పింఛన్‌ తీసుకునేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు తెలిపారు. దీంతో మదనపల్లెకు వచ్చిన సీఐ.. తన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల మొత్తం విచారించాడు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్‌కు స్వర్ణకుమారి భారీగా నగదు అప్పుగా ఇచ్చిందని.. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్‌ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనిల్ అనే మరొకరితో కలిసి వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


Similar News