AP News:ఆదివాసీ పిల్లల చదువు ప్రశ్నార్థకం:సీపీఐ జిల్లా కార్యదర్శి

ఏలూరు జిల్లా మారుమూల మండలం కుక్కునూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-10-19 15:22 GMT

దిశ,కుక్కునూరు: ఏలూరు జిల్లా మారుమూల మండలం కుక్కునూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని రెడ్డిగూడెం తోగు గుంపులో శనివారం శాఖ కార్యదర్శి సోడే.రమేష్ అధ్యక్షతన శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ గుంపు పిల్లలు అక్షరాలు దిద్దడానికి ఎటువంటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాగా సుమారు 20 మంది పిల్లలున్నారని చదువుకోవడానికి కనీసం అంగన్ వాడి కేంద్రం కూడా లేదని వాపోయారు. పిల్లలకు 5 ఏళ్లు వచ్చినా బడి ఎలా ఉంటుందో తెలియదని ఇక పలక, బలపం ఎరగరని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంపుకు వెళ్లాలంటే వాగు..రాళ్లు.. రప్పలు దాటుతూ చేరుకోవాలని,రహదారి సౌకర్యం లేక నానా తిప్పలు పడుతున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అడవి బిడ్డలను అడిగి అడిగి మరీ ఓటు వేయించుకున్న పాలకులు సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతున్నారని ఆరోపించారు. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల ద్వారా ఆదివాసీ గ్రామాల్ని అభివృద్ధి చేసి పిల్లలకు అంగన్వాడి, బడులు ఏర్పాటు చేసి పౌష్టికాహారం తో పాటు నాణ్యమైన విద్య అందించి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ కుక్కునూరు మండల కార్యదర్శి మైసాక్షి. వెంకటాచారి, జంగారెడ్డి గూడెం మండల కార్యదర్శి రమణ రాజు, జిల్లా సమితి సభ్యులు కురాకుల. బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News