Achennaidu: రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న

రాష్ట్ర రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

Update: 2024-11-15 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. వర్షాలు లేకపోవడం వల్ల పంటను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించనున్నట్లు ఈ రోజు (శుక్రవారం) అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్సల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పిన అచ్చెన్న.. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. మొత్తం 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని, వారికి నష్ట పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేశామని, త్వరలో బాధిత రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ప్రకటించారు. అంతేకాకుండా నష్టపోయిన వారికి రాయితీతో 47వేల క్విటాళ్ల విత్తనాల పంపిణీ చేశామని వివరించారు.

అనంతరం రాష్ట్రంలో జీడిమామిడి మద్దతు ధరపై కూడా మంత్రి మాట్లాడారు. ‘జీడిమామిడి మద్దతు ధర ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. జీడిమామిడి పండుకు బైప్రోడక్టుగా చాలా ఆదాయం రావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో జీడిమామిడి బోర్డు ఏర్పాటుపై కూడా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రితో చర్చించాం. శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామని వారు హామీ ఇచ్చారు.’ అని అచ్చెన్న వివరించారు. అలాగే గత ఐదేళ్ళలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం కొత్త చెట్లు అందజేయబోతోందని ప్రకటించారు. ఉద్ధానం ప్రాంతంలో ఒక కోకోనట్ పార్కు కావాలని అడిగారని, ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని, రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్.. రాష్ట్రంలో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచింది. గతంలో హెక్టారుకు రూ.17 వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయంగా అందించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు రాష్ట్రంలోని 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు.. ఈ-పంట ద్వారా రూ.284.56 కోట్లు జమ చేశారు. ఇక ఇదే ఏడాది జులైలో భారీ వర్షాలు, వరదల కారణంగా 4 జిల్లాల్లో పంట నష్టం జరగ్గా.. 23,259 మంది రైతులకు రూ.25.75 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రకటించడమే కాకుండా త్వరలో ఆ మొత్తాన్ని వారికి అందజేయబోతోంది ప్రభుత్వం. 


Similar News