కర్నూలు జిల్లాకు 4 నామినేటెడ్ పదవులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది.

Update: 2024-11-10 02:50 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు పార్టీ కోసం, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్ర నేతలకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కట్టబెడుతూ వచ్చింది. అందులో భాగంగానే మొదటి జాబితాలో జిల్లాలో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వగా రెండో జాబితాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలుగురికి చైర్మన్ పదవులు వరించాయి. దీంతో చాలా మంది అగ్ర నేతలు, పార్టీ కోసం కష్ట పడిన నేతలు నిరాశకు లోనయ్యారు. ఆదోనికి చెందిన దేవేంద్రప్ప, కప్పట్రాళ్ల బొజ్జమ్మకు ఊహించని పదవులు దక్కడంతో వారి అనుచరులు సంబరాల్లో మునిగి తేలారు.

రెండో జాబితాలో నలుగురికి ప్రాధాన్యత..

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన రెండో జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు నేతలకు ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఆలూరు నియోజకవర్గం కప్పట్రాళ్లకు చెందిన సుశీలమ్మ (బొజ్జమ్మ), నంద్యాల జిల్లాకు చెందిన చైర్మన్ ముస్తాక్ అహ్మద్, ఆదోనికి చెందిన దేవేంద్రప్పలకు ప్రాధాన్యత కల్పించారు. కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డిలు పోటీ పడ్డారు. కానీ అధినేత చంద్రబాబు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కట్టబెట్టారు. ఏపీ కురుమ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఏపీ వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ కప్పట్రాళ్ల సుశీలమ్మ (బొజ్జమ్మ), ఏపీ మైనారిటీస్ మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్‌లను నియమించారు.

మూడో జాబితాపై అగ్రనేతల ఆశలు..

నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టి ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కు సీటు కేటాయించారు. ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కాదని వీరభద్ర గౌడ్ కు, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, గుడిసె కృష్ణమ్మను కాదని ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధికి, మంత్రాలయంలో ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డిని కాదని రాఘవేంద్ర రెడ్డి కి కేటాయించారు. అలాగే, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని కాదని ప్రస్తుత ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి పత్తికొండ, డోన్, ఆలూరు టికెట్లు ఆశించిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ను కాదని కేఈ శ్యాంబాబుకు, పాణ్యం, శ్రీశైలంలో సీట్లు ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి కాకుండా పాణ్యం లో ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి, శ్రీశైలంలో ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి టికెట్లు కేటాయించారు. కానీ మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇక మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ రాష్ర్ట కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి తదితర నాయకులు మూడో జాబితాలోనైనా తమకు పదవులు కేటాయిస్తారనే ఆశలో ఉన్నారు.


Similar News