కరీంనగర్ జిల్లా యంత్రాంగంపై భారీ ఆరోపణలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇండోనేషియా వాసులతో కరోనా కరీంనగర్‌ను తాకింది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వాసులను హై అలర్ట్ చేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా కంటైన్‌మెంట్ ఏరియాలను ఏర్పాటు చేసింది. కొవిడ్‌ను కట్టడి చేయడంలో ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత కరీంనగర్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అయితే, ఇదంతా ఒకప్పుడు..ప్రస్తుతం కరోనా కరీంనగర్ జిల్లాను కలవరపెడుతున్నది. అన్ లాక్ డౌన్ తర్వాత ప్రారంభంలో పదుల సంఖ్యలోనే ఉన్న […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇండోనేషియా వాసులతో కరోనా కరీంనగర్‌ను తాకింది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వాసులను హై అలర్ట్ చేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా కంటైన్‌మెంట్ ఏరియాలను ఏర్పాటు చేసింది. కొవిడ్‌ను కట్టడి చేయడంలో ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత కరీంనగర్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అయితే, ఇదంతా ఒకప్పుడు..ప్రస్తుతం కరోనా కరీంనగర్ జిల్లాను కలవరపెడుతున్నది. అన్ లాక్ డౌన్ తర్వాత ప్రారంభంలో పదుల సంఖ్యలోనే ఉన్న కొవిడ్ కేసులు ఇప్పుడు వందల్లో చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 367 కేసులు నమోదయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం కరీంనగర్ సిటీలో నమోదయ్యాయి. అయితే ఆఫీసర్లు కరోనా కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి కట్టడికి చర్యలు మొదట్లో తీసుకున్నట్లుగా ఇప్పుడు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్ లాక్ డౌన్ తర్వాతే..
ఇండోనేషియా వాసులు కరీంనగర్‌కు వచ్చినప్పుడు వారిలో 10 మందికి పాజిటివ్ రాగా ఆ తర్వాత ప్రైమరీ కాంటాక్ట్ ఒకరికి కరోనా రాగా, సెకండరీ కాంటాక్ట్ ద్వారా మరో ఇద్దరు వ్యాధి బారిన పడ్డారు. దీంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం హై అలెర్ట్‌గా వ్యవహరించింది. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన ప్రాంతాలను కంటైన్ మెంట్ ఏరియాలుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాలను దిగ్బంధన చేసింది. ప్రజలు అత్యవసరాలు ఉంటే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసింది. పోలీసులు కూడా పకడ్భందీగా గస్తీ కాశారు. ప్రత్యేక బందోబస్తు చేపట్టడంతో పాటు డ్రోన్ కెమెరాల నిఘా నీడలో కాలనీల వాసులు జీవనం సాగించారు. నగరం దాటి వెళ్లే పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ డౌన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి జనం రాకపోకలు పెరిగిపోయాయి. వలస కూలీలు స్వస్థలాలకు వచ్చినప్పుడు కూడా కరీంనగర్ జిల్లాపై అంతగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు మాత్రం రోజు రోజుకూ కరోనా కేసులు సంఖ్య రెట్టింపు అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
సిటీలోనే ఎక్కువగా..
ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారిలో చాలా మంది హైదరాబాద్ నగరానికి వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సోమవారం 86 కేసులు పాజిటివ్‌గా నిర్దారణ కాగా, 84 మంది కరీంనగర్ సిటీతో పాటు సమీప గ్రామాలకు చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే నగరంలోనే కొవిడ్ 19 బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నది స్పష్టం అవుతోంది.
నిబంధనలు తుంగలోకి..
అన్ లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలోనూ కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ చాలా వరకు ఈ నిబంధనలు అమలు కావడం లేదు. వాటిని పాటిస్తున్న వారే కరువయ్యారు. మాస్కు తప్ప మిగతా అన్ని రూల్స్ అతిక్రమిస్తున్న వారే ఎక్కువయ్యారు. కొన్ని కూరగాయాల మార్కెట్లు, వైన్ షాపుల వద్ద ఫిజికల్ డిస్టెన్స్ బాక్సులు కూడా లేవు. ఈ నిబంధనల ఉల్లం‘ఘనుల’పై అధికార యంత్రాంగం అంతగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే సాధారణ పౌరుల్లో కూడా భయం లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి విషయంలో మొదట్లో కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం ప్రైమరీ కాంటక్టు, సెకండరీ కాంటాక్టు వివరాలు కూడా సేకరించింది. కానీ, ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టు విషయంలోనే ప్రత్యక దృష్టి సారిబచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పడు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే వీరిందరిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించినప్పటికీ క్వారంటైన్ చేయించడకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఐదు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంటే చాలన్నారని కొందరు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు యథావిధిగా తమ అధికారిక కార్యకలపాలను కొనసాగించడం విడ్డూరం. ప్రభుత్వంలో బాధ్యత కల్గిన పోస్టులో ఉన్న వారే నిబంధనలు పాటించకపోవడం వల్ల సాధారణ పౌరుల్లో బాధ్యతారాహిత్యం పెరిగే అవకాశం లేకపోదన్నది నిజం.