వ్యాపారాలు విలవిల.. ఆలయాలు వెలవెల
దిశ, మేడ్చల్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం మేడ్చల్ జిల్లాపై అధికంగానే కనిపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు వ్యాపార వర్గాలు విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కీసర, ఘట్‌కేసర్, కేపీహెచ్‌బీ కాలనీ, చింతల్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్‌మెట్ ప్రాంతాలన్నీ బోసిపోయాయి. జిల్లాలోని మార్కెట్లు, పర్యాటక స్థలాల్లో జనం కనబడటం లేదు. శామీర్‌పేట్ మండలంలోని రిస్టార్టుల్లో పర్యాటకుల సందడి దాదాపు పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. […]
దిశ, మేడ్చల్:
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం మేడ్చల్ జిల్లాపై అధికంగానే కనిపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు వ్యాపార వర్గాలు విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని మేడ్చల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కీసర, ఘట్‌కేసర్, కేపీహెచ్‌బీ కాలనీ, చింతల్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్‌మెట్ ప్రాంతాలన్నీ బోసిపోయాయి. జిల్లాలోని మార్కెట్లు, పర్యాటక స్థలాల్లో జనం కనబడటం లేదు. శామీర్‌పేట్ మండలంలోని రిస్టార్టుల్లో పర్యాటకుల సందడి దాదాపు పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. జిల్లాకే ఆధ్యాత్మికత శోభను తెచ్చిపెట్టిన కీసర మండలంలోని ప్రధాన ఆలయాలైన రామలింగేశ్వర, చీర్యాల నరసింహస్వామి ఆలయాలకు భక్తుల రాక తగ్గుముఖం పట్టింది. మున్సిపాలిటీలైన నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, ఘట్‌కేసర్, పోచారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మార్కెట్లపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది.
చేపలకు పెరిగిన గిరాకీ..
ఇక చికెన్ దుకాణాల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. చాలామంది దుకాణదారులు అసలు షాపులే తెరవడం లేదు. మరికొంతమంది కనీసం అద్దె కట్టేందుకైనా నడవకపోతదా అన్న ఆశతో తెరిచి కూర్చుంటున్నారు. కరోనా వైరస్ వల్ల చేపలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ప్రజలు బయటి ఆహారం తినేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో సందడి తగ్గింది. కొనుగోళ్లు లేక హోల్‌సేల్ చికెన్ ధర కిలో రూ.50కి పడిపోయింది. చికెన్ ధరలు భారీగా తగ్గినా కరోనా వైరస్ భయానికి అటువైపు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఇదే క్రమంలో మటన్, చేపల ధరలు మాత్రం పెరిగాయి.
హాస్టల్స్ సైతం ఖాళీ..
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, భాగ్యనగర్ కాలనీ, అడ్డగుట్ట సొసైటీ, వసంత్ నగర్, హైదర్ నగర్, గోకుల్ ప్లాట్స్ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు హాస్టల్స్‌లో విద్యార్థులు, ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులు కరోనా భయంతో ఇంటిబాట పట్టారు. దీంతో స్థానికంగా వ్యాపారం పడిపోయిందని చిరువ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి విద్యార్థులు హాస్టల్స్‌లో తినలేక.. ఆన్‌లైన్‌లో ఆర్డర్, స్థానిక హోటల్స్‌లో బిర్యానీని ఎక్కువగా తినేటోళ్లు. కానీ కరోనా కారణంగా వారి స్వగ్రామాలకు వెళ్లడంతో 30 శాతం అమ్మకాలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితి ఉన్నా.. అద్దెకు దుకాణాలు తీసుకుని నడిపిస్తున్న వ్యాపారులు తమ వ్యాపారాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
tags :Corona, Markets closed, Fish & Mutton rates, Hostel, Students