నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. క్యూకట్టిన ఉద్యోగులు, నిరుద్యోగులు

దిశ ప్రతినిధి , హైదరాబాద్ :   ఉద్యోగాలు లేక యువత, ఉద్యోగం ఉన్నా పై  అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల వెంట పరుగులు పెడుతుండటంతో నగరంలో  నకిలీ సర్టిఫికెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.  తయారీదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతోంది. అమాయక యువకులకు మాయమాటలు చెప్పి  నకిలీ సర్టిఫికెట్లను వారికి తయారీదారులు అంటగడుతున్నారు. వేల రూపాయలు  సులువుగా దొరుకుతుండడంతో జైలుకు వెళ్లి […]

Update: 2021-12-22 19:00 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఉద్యోగాలు లేక యువత, ఉద్యోగం ఉన్నా పై అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల వెంట పరుగులు పెడుతుండటంతో నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. తయారీదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతోంది. అమాయక యువకులకు మాయమాటలు చెప్పి నకిలీ సర్టిఫికెట్లను వారికి తయారీదారులు అంటగడుతున్నారు. వేల రూపాయలు సులువుగా దొరుకుతుండడంతో జైలుకు వెళ్లి శిక్షలు అనుభవించినప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.

బయటకు వచ్చిన అనంతరం తిరిగి తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పదవ తరగతి నుండి మొదలు ఏ సర్టిఫికెట్ కావాలన్నా క్షణాల్లో తయారు చేసి అందిస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల ను తలదన్నేలా తయారు చేసి ఇవ్వడంతో ఇది తెలియక కొనుగోలు చేసిన వారు అవి నకిలీవని తెలిసిన అనంతరం తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోతున్నారు. పోలీసుల దాకా వ్యవహారం వెళితే ఇబ్బందులు ఎదురౌతాయని ఫిర్యాదులు చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం డుప్లి కేటుగాళ్లకు కలసి వస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు అంతగా తెలియని యువత తప్పుడు మార్గం ఎంచుకుంటుండగా అన్నీ తెలిసిన ఉద్యోగులు కూడా నకిలీల వెంట పడుతుండడం గమనార్హం.

పట్టుబడుతున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు….

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలు తరచుగా పోలీసుల దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. గత నెలలో అమీర్ పేటలోని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు వెళ్లే వారికి సర్టిఫికెట్ అవసరం కాగా నకిలీ పత్రాలను తయారు చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. గత యేడాది జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) పరిధిలోని పలు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో నకిలీ ప్రొఫెసర్లుగా చెలామణి అవుతున్న వారి బాగోతం బయటపడింది. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న వీరు నకిలీ పీహెచ్‌డీలు పొంది, బోధిస్తున్నట్లు గుర్తించారు .

నకిలీ ప్రొఫెసర్లపై తొలుత ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జేఎన్‌టీయూ అధికారులు విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం వెలుగు చూడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరో సంఘటనలో ఇటీవల నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ ప్రధాన కేంద్రంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసిన పాతబస్తీకి చెందిన సయ్యద్ నవీద్, సయ్యద్ ఒవైసీలు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి రూ.50 నుంచి రూ.75 వేలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి 200 లకు పైగా నకిలీ సర్టిఫికెట్స్, కంప్యూటర్లు, రెండు ప్రింటర్స్, నాలుగు లాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగులకు అన్నీ తెలిసినా ….

ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలు హాట్ టాపిక్ గా మారాయి. బదిలీపై వెళ్లడం ఇష్టం లేని వారు పెడుతున్న ఫేక్ సర్టిఫికెట్లు ఉద్యోగ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు సందర్భంగా నిజంగా అనారోగ్యానికి గురైన వారికి మినహాయింపునిచ్చే అవకాశం ఉండడంతో ఏ అనారోగ్యం లేని వారు కూడా తమతో పాటు , తమ కుటుంబీకులు కూడా జబ్బుల బారిన పడ్డారని సర్టిఫికెట్లను జత చేయడం వంటివి చేస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో సర్టిఫికెట్లు పెట్టిన వారి విషయంలో విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు .

ఇలా ఉద్యోగం పొందేందుకు యువత, ఉద్యోగం చేస్తూనే ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల వెంట పడడం అంతటా చర్చనీయాంశమైంది. సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు మార్గాలు ఎంచుకోవడం పట్ల యువతకు ఎలాంటి మెసేజ్ అందిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు .

Tags:    

Similar News