ప్రజా ఉద్యమాలపై కరోనా ఎఫెక్ట్ !

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజా ఉద్యమవేదికలు బోసిపోతున్నాయి. ప్రజాపోరాట ఉద్యమాలు, సమావేశాలు, రాజకీయ సభలకు అనుమతి లేకపోవడంతో రాష్ట్ర రాజకీయ రంగంలో ప్రశ్నించే గొంతులు మూగబోతున్నాయి. కరోనా ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలు కూడా అర్ధాంతరంగా ముగించడంతో ప్రతిపక్షాలకు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం దక్కలేదు. ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ విపక్షాలు, ఆయ ప్రజాసంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు కరోనా వైరస్ […]

Update: 2020-03-19 07:05 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజా ఉద్యమవేదికలు బోసిపోతున్నాయి. ప్రజాపోరాట ఉద్యమాలు, సమావేశాలు, రాజకీయ సభలకు అనుమతి లేకపోవడంతో రాష్ట్ర రాజకీయ రంగంలో ప్రశ్నించే గొంతులు మూగబోతున్నాయి. కరోనా ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలు కూడా అర్ధాంతరంగా ముగించడంతో ప్రతిపక్షాలకు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం దక్కలేదు.

ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ విపక్షాలు, ఆయ ప్రజాసంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు కరోనా వైరస్ చెక్ పెట్టింది. ఈ నెల 31 వరకు ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతిలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాచౌక్‌లు వెలవెలబోతున్నాయి. పలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నాయి. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రజా సంఘాల ఐక్యపోరాట కార్యాచరణలో భాగంగా ఈ నెల 21 ఇందిరాపార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం చేపట్టిన నిరశన కార్యక్రమానికి కూడా కరోనా సెగ తగిలింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పక్షాలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్న సందర్భంలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి దేశానికి చేరడంతో ధర్నాలు, రాస్తారోకోలు తగ్గుముఖం పట్టాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అనుమతి లేకపోవడంతో సాదాసీదాగా కానిస్తున్నారు. ఇటీవల బీజేపీ నూతన అధ్యక్షుడి అభినందన సభను ఎక్కువ మందితో నిర్వహిస్తే ప్రమాదమని గుర్తించిన ఆ పార్టీ నాయకులు ర్యాలీలను రద్దు చేసుకున్నారు. రాష్ట్ర పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలు కూడా అర్ధాంతరంగా ముగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ప్రభుత్వాల పనితీరుపై ప్రశ్నించే గొంతులు వినబడేలా లేవు.

Tags : koronavirus, politics, assembly, indira park, meeting, saba, students, caa,

Tags:    

Similar News