పురాతన నక్షత్రాల మ్యాప్ ‘నెబ్రా స్కై డిస్క్’
దిశ, ఫీచర్స్ : ‘నెబ్రా స్కై డిస్క్’ను ప్రపంచంలోని పురాతన నక్షత్రాల మ్యాప్‌గా భావిస్తారు. కళాత్మకంగా కనిపించే ఈ వృత్తాకార రాగి ప్లేట్ దాదాపు 12 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ డిస్క్‌లో నక్షత్రాలు, చంద్రుడు సహా సూర్యుడిని సూచించే వృత్తాకారాలు, నెలవంకలు వాటి చుట్టూ నక్షత్రాలు ఉంటాయి. ఇది కాంస్య యుగం నాటిదని, 3,600 సంవత్సరాల క్రితం ఇది వాడుకలో ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం డిస్క్ […]
దిశ, ఫీచర్స్ : ‘నెబ్రా స్కై డిస్క్’ను ప్రపంచంలోని పురాతన నక్షత్రాల మ్యాప్‌గా భావిస్తారు. కళాత్మకంగా కనిపించే ఈ వృత్తాకార రాగి ప్లేట్ దాదాపు 12 అంగుళాల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ డిస్క్‌లో నక్షత్రాలు, చంద్రుడు సహా సూర్యుడిని సూచించే వృత్తాకారాలు, నెలవంకలు వాటి చుట్టూ నక్షత్రాలు ఉంటాయి. ఇది కాంస్య యుగం నాటిదని, 3,600 సంవత్సరాల క్రితం ఇది వాడుకలో ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం డిస్క్ అంత పాతది కాకపోవచ్చునని వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా ఇది పూర్తిగా ప్రత్యేకమైన కళాఖండం కాగా 20వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన పురావస్తు పరిశోధనల్లో ఒకటిగా బవేరియన్ స్టేట్ ఆర్కియాలజిస్టులు పేర్కొన్నారు. $ 11 మిలియన్ విలువైన ఈ నెబ్రా స్కై డిస్క్‌ను ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిస్క్ ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని ఎలా ఉపయోగించారు వంటి విశేషాలు తెలుసుకుందాం.
దాదాపు 3,600ఏళ్ల క్రితం జర్మనీలోని నెబ్రా సమీపంలో రెండు కత్తులు, గొడ్డళ్లు, రెండు ఉంగరాలు, ఒక కాంస్య ఉలితో పాటు డిస్క్‌ను ఖననం చేశారు. వీటిని దేవుళ్లకు అంకితం చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే దీని మూలం గురించి ఇప్పటికీ పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇనుప యుగం లేదా కాంస్య యుగం నాటిది కాదని అసలు ఇది ఖగోళ మ్యాప్ కాదంటూ మతపరమైన చిహ్నమంటూ కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పురావస్తు సంస్థ ద్వారా ఆర్కియాలజీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఈ డిస్క్ ఖననం చేయబడినప్పటికి పూర్వమే 200ఏళ్లకు పైగా ఉపయోగంలో ఉన్నట్లు పేర్కొంది. డిస్క్‌ను తయారిలో ముడి పదార్థాలు ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్ నుంచి దిగుమతి చేయబడ్డాయని, వస్తువును సృష్టించడానికి అవసరమైన పరిజ్ఞానం ‘పూర్తిగా స్థానికమైంది’గా వెల్లడించింది. కాంస్య డిస్క్ ‘స్పెసిఫిక్ ఆస్ట్రానామికల్ ఫినామిన్’కు సంబంధించిన ఐదు దశలను కలిగి ఉన్నట్లు పత్రిక పేర్కొంది. మొదటి దశలో రాత్రి ఆకాశాన్ని 32 బంగారు నక్షత్రాలతో చిత్రీకరించింది, ఇందులో ప్లీయేడ్స్ కూటమి, సూర్యుడు లేదా పౌర్ణమి, చంద్రవంకను సూచించే హోల్డ్ ఆర్బ్ ఉంది. లీపు నెలని చేర్చడం ద్వారా చంద్ర, సౌర సంవత్సరాలను సమకాలీకరించడానికి ఈ దృష్టాంతం రిమైండర్‌లా పనిచేస్తుంది.
ఎక్కడ? ఎప్పుడు?
1999లో జర్మనీ, నెబ్రా పట్టణానికి సమీపంలో ఉన్న మిట్టెల్‌బర్గ్ కొండపై మెటల్ డిటెక్టర్ ఉపయోగించి నిధి వేటగాళ్లు నెబ్రా డిస్క్‌ను కనుగొన్నారు. ఈ తవ్వకం చట్టవిరుద్ధం కాగా, దురదృష్టవశాత్తు దాన్ని భూమి నుంచి తీసే క్రమంలో డిస్క్‌కు గణనీయమైన నష్టాన్ని కలిగించారు. ఇందులో దాని బయటి అంచు కోల్పోవడం, ఒక నక్షత్రం రాలిపోవడంతో పాటు గోల్డ్ డిస్క్‌కు చెందిన మరో పెద్ద ముక్క విడిపోవడంతో ఇది కొంతభాగాన్ని కోల్పోయింది. అయినా కాంస్య ఖడ్గాలతో సహా ఇతర కళాఖండాలతో కలిపి వేటగాళ్లు దానిని డీలర్‌తో కలిసి విక్రయించారు. డిస్క్ తర్వాతి రెండేళ్లలో రెండుసార్లు చేతులు మారగా, ఆ తర్వాత ఫిబ్రవరి 2003లో డిస్క్‌ను స్విట్జర్లాండ్‌లోని పురాతన వస్తువుల కలెక్టర్‌కు $ 400,000 కు విక్రయించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన అధికారులు దీన్ని సొంతం చేసుకున్నారు. నెబ్రా పట్టణానికి సమీపంలో ఉన్న కొండపై జరిపిన తవ్వకాల్లో ఇది లభ్యమైనట్లు దోపిడీదారులు అధికారులకు వివరించారు. అయితే ఇది క్రీస్తుపూర్వం 1600లో ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే యునిటిస్ సంస్కృతితో సంబంధం కలిగి ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఎందుకు ఉపయోగించారు?
చాలామంది పరిశోధకులు దీన్ని పురాతన నక్షత్రాల మ్యాప్‌గానే అభివర్ణిస్తారు. అయితే కాంస్య యుగ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డ సమూహం కావడంతో సంవత్సర సమయాన్ని తెలుసుకోవడానికి నాట్లు వేయడం, పంట సమయం, కోత కాలాలను నిర్ణయించడానికి ఖగోళ గణన సాధనంగానూ దీన్ని ఉపయోగించారు. అయితే ఉత్తర ఐరోపా అంతటా వేలాది ఏళ్లుగా వేసవి, శీతాకాలపు అయనాంతాలను గుర్తించడానికి స్మారక కట్టడాలు సమలేఖనం చేయబడ్డాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్‌లోని స్టోన్‌హెంజ్, ఐర్లాండ్‌లోని న్యూగ్రాంజ్ చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సూర్యోదయ, సూర్యాస్తమయంలో సూర్యుడి స్థానాన్ని గుర్తించేందుకు ఈ డిస్క్ వినియోగించి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు బోచుమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వోల్ఫ్‌హార్డ్ ష్లోసర్, డిస్క్‌కు ఇరువైపులా ఉన్న జత వంపుల మధ్య కోణాన్ని కొలవగా, అది 82 డిగ్రీలు ఉన్నట్లు గుర్తించాడు. మిట్టెల్‌బర్గ్ కొండ వద్ద అధిక మధ్య వేసవి సూర్యాస్తమయం, తక్కువ మధ్య శీతాకాల సూర్యాస్తమయం మధ్య, సూర్యుడు హోరిజోన్ వెంట 82 డిగ్రీల చుట్టూ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కోణం ఒక్కో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, మరింత ఉత్తరానికి వెళితే..ఇది 90 డిగ్రీలుంటే, అదే దక్షిణాన 70గా నమోదవుతుంది. కానీ మధ్య ఐరోపాలోని పరిమిత బెల్ట్‌లో ఆకాశంలో సూర్యుడి గమనం కచ్చితంగా 82 డిగ్రీలు ఉంటుంది. నెబ్రా డిస్క్ చుట్టుకొలతతో ఉన్న జత వంపులు సూర్యుని అయనాంతాలను దాని స్థానానికి కచ్చితంగా వర్ణిస్తాయని ష్లోసర్ నిర్ధారించారు.
పంటకాలాలకు ప్రతీక
కాంస్య యుగం నాటి ఖగోళ విజ్ఞానానికి మరింత సాక్ష్యంగా కొంతమంది పరిశోధకులు డిస్క్‌లో ప్లీయేడ్స్ స్టార్ క్లస్టర్ ఉనికిని సూచించారు. ఈ రోజుల్లో ప్లీయేడ్స్‌లో కేవలం ఆరు నక్షత్రాలు మాత్రమే కంటికి కనిపిస్తున్నప్పటికీ, కాంస్య యుగంలో సమూహంలోని ఒక నక్షత్రం చాలా ప్రకాశవంతంగా ఉండవచ్చు, అంతేకాదు పురాతన కాలంలో గ్రీకులో వాటిని ‘సెవెన్ సిస్టర్స్’ అని పిలిచేవాళ్లు. మెసొపొటేమియా, గ్రీస్‌తో సహా అనేక పురాతన నాగరికతలకు ప్లీయేడ్స్ ఒక ముఖ్యమైన రాశి కాగా శరదృతువులో నక్షత్రం ఆకాశంలో కనిపిస్తే, పంట కోయడానికి సమయం ఆసన్నమైందని, అదే వసంతకాలంలో అదృశ్యమైతే పంటలు నాటడానికి సమయం వచ్చిందని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. చరిత్రపూర్వ వ్యవసాయానికి సంబంధించి డిస్క్ నక్షత్రాలు వివరిస్తాయని పరిశోధకులు తెలిపారు. అలాగే ప్రాచీన ఈజిప్షియన్లు సూర్యుడిని అత్యంత శక్తివంతమైన దేవుడిగా కొలుస్తారు. ఓడలో రాత్రి ఆకాశం గుండా ప్రయాణించి, ఉదయం సూర్యోదయ సమయంలో, అతడు పునర్జన్మ పొందుతాడని వారు విశ్వసిస్తారు. దీనికి అనుగుణంగా నెబ్రా డిస్క్ దిగువన ఉన్న గోల్డెన్ ఆర్క్ వాస్తవానికి రాత్రి ఆకాశం మీదుగా ప్రయాణించే సూర్య నౌకను సూచించే చిహ్నాలున్నాయి.
సూర్యుడు దాని అయనాంతాలు నెబ్రా డిస్క్‌లోని గుర్తులతో సరిపోలుతాయి. ఉత్తర యూరోపియన్‌లో కాంస్య యుగం నాటి ప్రజలకు సూర్యుడు కేంద్రంగా ఉన్నారని నమ్ముతారు. డిస్క్‌లోని కేంద్ర వృత్తం సూర్యుడిని సూచిస్తుంది. డిస్క్‌కు ఇరువైపులా ఉన్న ఆర్క్‌లు ఏడాదిలోని వివిధ ప్రదేశాల్లోని సూర్యాస్తమయాల పరిధిని సూచిస్తాయి. దీనిని కొన్నిసార్లు ‘జర్మన్ స్టోన్‌హెంజ్’ అని కూడా అంటారు. డిస్క్ ఒక నిర్దిష్ట భౌగోళిక అక్షాంశానికి స్థిరంగా ఉన్న ఖగోళ సమాచారాన్ని సూచిస్తుందని కూడా నమ్ముతారు. యూరోపియన్ ప్రజల విశ్వాస వ్యవస్థ (సూర్యచంద్రులు ఆరాధన)లోని చిహ్నాలన్నింటినీ నెబ్రా డిస్క్‌లో ఒకచోట చేర్చినందున, మొదటిసారి ప్రజలు ఏది విశ్వసించారో అదే నెబ్రా డిస్క్‌లో పొందుపరిచారు.
– ప్రొఫెసర్ మిరాండా ఆల్డ్‌హౌస్, పురావస్తు శాస్త్రవేత్త, కాంస్య యుగం నిపుణుడు
నెబ్రా స్కై డిస్క్ గోసెక్ సైట్‌తో పాటు, ఐరోపాలో వివరణాత్మక జ్యోతిష్య పరిజ్ఞానానికి మొదటి ఉదాహరణగా అభివర్ణిస్తున్న పరిశోధకులు, లభించిన డిస్క్ జతలో ఇది ఒకటి మాత్రమేనని, మరొక నెబ్రా డిస్క్ జత కొండలో ఎక్కడో మిస్ అయి ఉంటుందని వాళ్లు అభిప్రాయపడతున్నారు.