ఇంటర్నేషనల్ ట్రెండ్ ‘హింగ్లిష్’
దిశ, ఫీచర్స్ : ఒకరితో మరొకరు సులభంగా కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించుకునే సాధనమే ‘భాష’. సరిహద్దులు మారే కొద్దీ భాష మారుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ, ప్రాంతీయ భాషలు పుట్టుకొచ్చాయి. ప్రతీ భాష దేనికదే గొప్పదే అయినా, ఎక్కడికెళ్లినా ‘యూనివర్సల్’గా అందరూ కమ్యూనికేట్ కావడానికి ‘ఇంగ్లిష్’ ఉపయోగిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు ఉర్దూ, హిందీ, సంస్కృత పదాలను ప్రాంతీయ యాస, భాషల్లో మిళితం చేసుకోగా దేశీ వాసులు ‘ఇంగ్లిష్’ను హిందీలో మిక్స్ చేసి ‘హింగ్లిష్’ను పుట్టించారు. ఇది […]
దిశ, ఫీచర్స్ : ఒకరితో మరొకరు సులభంగా కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించుకునే సాధనమే ‘భాష’. సరిహద్దులు మారే కొద్దీ భాష మారుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ, ప్రాంతీయ భాషలు పుట్టుకొచ్చాయి. ప్రతీ భాష దేనికదే గొప్పదే అయినా, ఎక్కడికెళ్లినా ‘యూనివర్సల్’గా అందరూ కమ్యూనికేట్ కావడానికి ‘ఇంగ్లిష్’ ఉపయోగిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు ఉర్దూ, హిందీ, సంస్కృత పదాలను ప్రాంతీయ యాస, భాషల్లో మిళితం చేసుకోగా దేశీ వాసులు ‘ఇంగ్లిష్’ను హిందీలో మిక్స్ చేసి ‘హింగ్లిష్’ను పుట్టించారు. ఇది బాగానే పాపులర్ కావడంతో పాటు ఇదో కొత్త రకం భాష అని గుర్తుపట్టలేనంతగా కలిసిపోయింది. ఈ నేపథ్యంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్, ట్రావెల్, హ్యుమర్, కల్చర్ వంటి అంశాలపై ‘హింగ్లిష్’లో వార్తలు అందిస్తోంది ఆర్‌వీ టాక్స్ మీడియా. ఆ హింగ్లిష్ మ్యాగజైన్ విశేషాలతో పాటు హింగ్లిష్ లాంగ్వేజ్ హిస్టరీ గురించి స్పెషల్ స్టోరీ..
ఇంగ్లిష్ మాట్లాడే వ్యక్తులతో పాటు ‘హింగ్లిష్’ను ఇష్టపడే వారికోసం సులభంగా కంటెంట్ అందించే వేదికను రూపొందించాలనే ఉత్తర్‌ప్రదేశ్ ఆర్కిటెక్ట్ నేహా కుమారి ఆలోచనల్లో ‘ఆర్‌వి టాక్స్ మీడియా హింగ్లిష్ మ్యాగజైన్’తో పాటు పోర్టల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 2020లో ఈ పత్రిక మొదలు కాగా, కేవలం ఒక నెల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా అశేష ఆదరణ లభించింది. దాంతో తన స్నేహితురాలు స్వాతి సింగ్‌తో కలిసి బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం నలుగురు మహిళలు, ఒక అబ్బాయి ఇందులో పనిచేస్తుండగా, ప్రపంచంలోనే హింగ్లిష్‌లో లాంచ్ చేసిన తొలి పత్రిక, పోర్టల్‌గా ఈ యంగ్ డైనమిక్ బృందం చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం వారికి 30 వేలకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు, 50 వేలకు పైగా ఈ-మ్యాగజైన్ రీడర్లు ఉన్నారు. హింగ్లిష్‌లో కచ్చితమైన సమాచారాన్ని అందించడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యమని నేహా కుమారి తెలిపింది.
హిందీ+ఇంగ్లిష్..
90వ దశకం చివర్లో పెప్సికో తమ ‘ఆస్క్ ఫర్ మోర్’ క్యాంపెయిన్‌లో భాగంగా ‘యే దిల్ మాంగే మోర్’ అనే యాడ్ తీసుకొచ్చింది. ఈ ట్యాగ్‌లైన్ సూపర్ హిట్ కాగా, హిందీ-ఇంగ్లిష్ పదబంధాల జోడికి ‘ట్రెండ్’ సృష్టించింది. వెంటనే కోకాకోలా ‘లైఫ్ హో తో ఐసీ’ అంటూ మార్కెట్లోకి న్యూ యాడ్‌తో వచ్చేసింది. ఈ క్రమంలో ‘హంగ్రీ క్యా, యే మై రైట్ చాయిస్ బేబీ’ వంటి ట్యాగ్‌లైన్స్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇలా ఇండియన్ యాడ్ రంగంలో హిందీ, ఇంగ్లిష్ మిక్సింగ్ పదాల జోరు కొనసాగింది. అయితే చాలామంది భావించినట్లు ‘హింగ్లిష్’ ఇటీవల పురుడుపోసుకోలేదు. 1887లోనే ప్రముఖ కవి అయోధ్య ప్రసాద్ ఖత్రి తన గజల్‌లో హింగ్లిష్ పదాలు బోలెడు ఉపయోగించాడు. ఇక బాలీవుడ్ గత దశాబ్దంలో వచ్చిన చిత్రాల పేర్లు చూస్తే.. ‘జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, జై మమ్మీ దీ, ఆంగ్రేజి మీడియం’ వంటివి బోలెడు కనిపిస్తాయి. ఇక పాటల్లోనూ ‘హింగ్లిష్’ సర్వసాధారణమైంది. ‘హింగ్లిష్’కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో యూకేలోని ‘పోర్ట్స్‌మౌత్ కాలేజ్’ ఈ హైబ్రిడ్ లాంగ్వేజ్‌పై విద్యార్థుల అవగాహన పెంచడానికి, యూకేతో పాటు అంతర్జాతీయ సమాజంలో వ్యాపారంలో హింగ్లిష్ ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి 2017 నవంబర్‌లో ఎంపిక చేసిన విద్యార్థుల బృందం కోసం ప్రత్యేకమైన కోర్సును ప్రవేశపెట్టింది. భారతదేశానికి సంబంధించిన ప్రకటనలు, సినిమాలు, వార్తాపత్రికలలో ముఖ్యాంశాల్లో ఈ భాషకు పెరుగుతున్న ఆదరణ విద్యార్థులకు తెలపడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమని కాలేజీ ప్రతినిధులు తెలిపారు. ‘మోడర్న్ బిజినెస్ అండ్ కల్చర్ ప్రొగ్రామ్’లో భాగంలో ఈ కోర్సు 2018-19 అకడమిక్ ఇయర్ నుంచి రెగ్యులర్ చేశారు.
ఒకే సంభాషణలో రెండు లేదా అంతకంటే ఎక్కువ భాష పదాలను ఉపయోగించి మాట్లాడటాన్ని భాషా శాస్త్రవేత్తలు ‘కోడ్-స్విచింగ్’ లేదా ‘కోడ్-మిక్సింగ్’ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఒక భాష నుంచి ఒక పదాన్ని తీసుకుని, దాన్ని అనువాదం చేయకుండా మరొక భాషలో చేర్చి ఉపయోగిస్తారు. మనం మాట్లాడేది ‘హింగ్లిష్’ అని తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. ఉదాహరణకు..‘డూ దిస్ నా’! ఇందులో ‘నా’ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ప్రతి పదం తర్వాత దాన్ని చేర్చుతున్నాం. ‘పూర్ జోక్, సబ్‌సే బెస్ట్ ఫ్రెండ్, హల్లో సంతోష్ జీ’ ఇలా పరిశీలించాలే కానీ బోలెడు పదాలు మనం రోజూ ఉపయోగిస్తుంటాం. భారతీయ భాషాలను ఇంగ్లిష్ ఆక్రమించిందని చెప్పడానికి ఈ హైబ్రిడ్ లాంగ్వేజ్ నిదర్శనం. గత రెండున్నర దశాబ్దాలలో ఇంగ్లిష్ మరింత విస్తృతంగా విశ్వవ్యాప్తమయింది. ఒక్క హిందీనే కాదు, భారతదేశంలోని ఇతర భాషలలోకి ఇంగ్లిష్ ప్రవేశించింది. టాంగ్లిష్ (తమిళ+ఇంగ్లిష్), కాంగ్లిష్ (కన్నడ +ఇంగ్లిష్), బొంగ్లిష్ (బెంగాలీ+ఇంగ్లిష్), పంగ్లిష్ ( పంజాబీ+ఇంగ్లిష్) మొదలైనవి. అంతర్జాతీయంగానూ యూఎస్‌లోని అనేక ప్రాంతాలలో స్పాంగ్లిష్ (స్పానిష్ +ఇంగ్లిష్) మాట్లాడుతుండగా, ఫిలిప్పీన్స్‌లో తగ్లిష్ (తగలోగ్ +ఇంగ్లిష్)లో ముచ్చటించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ‘హింగ్లిష్’ ప్రస్తుతం మీడియా, సినిమా, యాడ్ రంగాల్లోనే కాదు అంతర్జాతీయంగానూ ట్రెండ్‌గా మారిపోయింది. సమజ్ గయే న బాస్..