మహమ్మారి మళ్లీ వస్తోంది.. జాగ్రత్తగా ఉండండి

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అలర్టయింది. కరీంనగర్ జిల్లాలో ఓ అంతిమయాత్రలో పాల్గొన్న 33 మందికి పాజిటివ్‌గా తేలడంతో జిల్లాల వైద్యాధికారులు కూడా మేలుకున్నారు. వైరస్ తాత్కాలికంగా బలహీనపడిందే తప్ప పూర్తిగా పోలేదని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే వ్యక్తులకూ, సమాజానికి శ్రీరామరక్ష అని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉందని, పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితిని […]

Update: 2021-02-20 12:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అలర్టయింది. కరీంనగర్ జిల్లాలో ఓ అంతిమయాత్రలో పాల్గొన్న 33 మందికి పాజిటివ్‌గా తేలడంతో జిల్లాల వైద్యాధికారులు కూడా మేలుకున్నారు. వైరస్ తాత్కాలికంగా బలహీనపడిందే తప్ప పూర్తిగా పోలేదని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే వ్యక్తులకూ, సమాజానికి శ్రీరామరక్ష అని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉందని, పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

వైరస్ వ్యాప్తి నివారణ కోసం స్థానిక పరిస్థితుల ఆధారంగా మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లను పెట్టడంపై కూడా ప్రజారోగ్య, వైద్యారోగ్య శాఖల నుంచి జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఎంతో కొంత జాగ్రత్తలు పాటించిన ప్రజలు ఇప్పుడు నిబంధనలన్నింటినీ గాలికొదిలేశారు. లాక్‌డౌన్ కంటే ముందున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. మాస్కులు ధరించకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినా రాజకీయ సభలు, సమావేశాలు, వివాహాలు, ఫంక్షన్లు మామూలైపోయాయి.

కరీంనగర్ సంఘటనతో ప్రజారోగ్య శాఖ టెస్టింగ్, ట్రేసింగ్ పెంచాలని స్పష్టం చేసింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే మూడు విధానాలను పాటించాల్సిందిగా అప్రమత్తం చేశామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా వైరస్ ఇంకా ఉనికిలోనే ఉందన్నారు. కొత్త రకాల స్ట్రెయిన్‌లు వస్తున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందుతోందని అన్నారు. కొన్ని మనం గుర్తించగలుగుతున్నా, మరికొన్ని మన ఊహకు అందడం లేదన్నారు.

‘‘రానున్న రెండు నెలల కాలంలో వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉంది. నివారించడానికి అన్ని జాగ్రత్తలు మేం తీసుకుంటున్నా ప్రజలలో నిర్లక్ష్యం మాత్రం బాగా పెరిగింది. మేల్కోకపోతే వైరస్ బారిన పడకతప్పదు. రోడ్ల మీద కనీసం పది శాతం మంది కూడా మాస్కులు పెట్టుకోవడంలేదు. వ్యాక్సిన్ తీసుకోడానికి కూడా చాలా మంది వెనకాడుతున్నారు. అవకాశం ఉన్నవారు వినియోగించుకోవాలి. వారు భద్రంగా ఉండడం మాత్రమే కాక ఇతరులకు వ్యాప్తి చేయకుండా ఉండగలుగుతారు’’ అని వివరించారు. మరిన్ని పరీక్షలను పెంచాలని ఆదేశించామన్నారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించాల్సిందిగా నొక్కిచెప్పామని, అవసరమైతే కంటైన్‌మెంట్ జోన్లను పెట్టాలని సూచించామని వివరించారు. జిల్లాల వైద్యాధికారులతో పరిస్థతిని సమీక్షించామన్నారు.

* తప్పనిసరిగా మాస్కు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయొద్దు
*ఎక్కువ మంది గుమికూడే ప్రాంతాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. తగిన జాగ్రత్తలతో సోషల్ డిస్టెన్స్ పాటించాలి
* కరోనా పూర్తిగా తొలగిపోలేదనే వాస్తవాన్ని గమనంలో ఉంచుకుని స్వీయ నియంత్రణలను కొనసాగించాలి
*కొత్తగా పుట్టుకొస్తున్న రకాలను దృష్టిలో పెట్టుకుని వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
*లాక్‌డౌన్ లాంటి పరిస్థితి రాకుండా ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో వైరస్ వ్యాప్తి నివారణ కోసం కృషి చేయాలి

Tags:    

Similar News