ఐఏఎస్ క్రాక్ చేస్తానంటున్న యాసిడ్ బాధితురాలు కాజల్!

దిశ, ఫీచర్స్: 2016 ఫిబ్రవరి 14.. గుజరాత్‌, మెహసానాకు చెందిన కాజల్ ప్రజాపతి కాలేజ్‌కు వెళ్తోంది. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్(హార్దిక్ ప్రజాపతి).. ఆమె ముఖం, ఛాతీ, చేతుల పై యాసిడ్ పోసి పారిపోయాడు. ఈ ఘటనలో కాజల్ ముఖమంతా కాలిపోవడంతో పాటు ఓ కన్ను కూడా కోల్పోయింది. చికిత్సలో భాగంగా మొత్తం 27 ఆపరేషన్లు చేయాల్సి రాగా.. భయానక స్థితి నుంచి బయట పడేందుకు ఆమెకు ఆరేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం ఒకే కన్నుతో […]

Update: 2021-12-28 04:44 GMT

దిశ, ఫీచర్స్: 2016 ఫిబ్రవరి 14.. గుజరాత్‌, మెహసానాకు చెందిన కాజల్ ప్రజాపతి కాలేజ్‌కు వెళ్తోంది. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్(హార్దిక్ ప్రజాపతి).. ఆమె ముఖం, ఛాతీ, చేతుల పై యాసిడ్ పోసి పారిపోయాడు. ఈ ఘటనలో కాజల్ ముఖమంతా కాలిపోవడంతో పాటు ఓ కన్ను కూడా కోల్పోయింది. చికిత్సలో భాగంగా మొత్తం 27 ఆపరేషన్లు చేయాల్సి రాగా.. భయానక స్థితి నుంచి బయట పడేందుకు ఆమెకు ఆరేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం ఒకే కన్నుతో కొత్త ప్రపంచాన్ని చూస్తున్న కాజల్.. తిరిగి చదువు మొదలు పెట్టడమే కాకుండా ఐఏఎస్ క్రాక్ చేసేందుకు శ్రమిస్తోంది. రిక్షా డ్రైవర్ కూతురైన కాజల్‌కు చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలనేది కల. కానీ యాసిడ్ ఎటాక్ ఆమె జీవితాన్ని అగాధంలోకి నెట్టింది.

ఆ గాయాలు, ఘటన నుంచి బయటపడ్డ కాజల్ మళ్లీ చదువుకోవాలనుకుంది. తన కోరికకు తండ్రి మద్దతు తెలిపడంతో తిరిగి కాలేజ్‌లో చేరింది. కాగా తాను అనుభవించిన బాధను ఏ ఆడపిల్ల అనుభవించకూడదని ఆశిస్తున్న కాజల్.. సొసైటీలో అమ్మాయిలకు రక్షణ పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అందుకోసం తాను కలెక్టర్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే కాజల్ ట్రీట్మెంట్ కోసం ఆమె తల్లిదండ్రులు దాదాపు రూ. 15 లక్షలకు పైగా ఖర్చు చేయగా ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల సాయం అందింది. ఈ క్రమంలో ఆస్తులు సహా ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఐఏఎస్ కల నెరవేరేందుకు కూడా కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు.

ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.

హార్దిక్ మా కులం అబ్బాయి. రోజూ కాలేజీకి వెళ్లే క్రమంలో నన్ను వెంబడించేవాడు. వాలెంటైన్ డే సందర్భంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను చదువుకోవాలని, ఇలాంటివి నాకు నచ్చవని అతడి ప్రపోజల్‌ను నిరాకరించా. దీంతో అదే రోజు సాయంత్రం యాసిడ్ తీసుకొచ్చి నాపై దాడి చేశాడు. ఈ ఇన్సిడెంట్‌లో నా ముఖం మొత్తం కాలిపోయింది. అసలు కళ్లు తెరవలేకపోయాను. డాక్టర్లు సైతం నేను మళ్లీ చూడగలనని అనుకోలేదు. 18 ఆపరేషన్ల తర్వాత ఓ కన్నుకు జీవం వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ చేయడంతో నన్ను నేను చూసుకో గలుగుతున్నాను. ఇందుకు కారణమైన హార్దిక్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ నేను భరించిన బాధను ఎప్పటికీ మరచిపోలేను. ఆడవాళ్లకు తోడుగా ఉండేందుకు, వారికి మరింత రక్షణ కల్పించేందుకు ఐఏఎస్ కావాలనుకుంటున్నాను.

– కాజల్

Tags:    

Similar News