స్కాట్లాండ్‌పై అఫ్గానిస్తాన్ సంచలన విజయం.. 130 పరుగుల భారీ తేడాతో..
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021లో అఫ్గానిస్తాన్ సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ 2లో భాగంగా సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ కలసి ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలసి 28 పరుగులు జోడించిన తర్వాత […]
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021లో అఫ్గానిస్తాన్ సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ 2లో భాగంగా సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ కలసి ధాటిగా ఆడారు. వీరిద్దరూ కలసి 28 పరుగులు జోడించిన తర్వాత అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లతో రెచ్చిపోయాడు.
కైల్ కొయెట్జర్ (10) ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాలమ్ మెక్లాయిడ్, రిచీ బెరింగ్టన్‌లు ముజీబుర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అఫ్గానిస్తాన్ బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. స్కాట్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా 5 డకౌట్లు ఉన్నాయి. స్పిన్నర్లు ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్‌లు కలసి 9 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ మున్సే చేసిన 25 పరుగులే అత్యధికం. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ దాటలేదంటే ఎంత దారుణంగా బ్యాటింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో స్కాట్లాండ్ జట్టు కేవలం 10.2 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్గానిస్తాన్ ఏకంగా 130 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముజీబుర్ రెహ్మాన్ 5, రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఒక వికెట్ దక్కింది. ముజీబుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకు మునుపు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌కు బ్యాటర్లు భారీ స్కోర్ అందించారు. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెహజాద్ కలసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. షహజాద్ (22) షరిఫ్ బౌలింగ్‌లో గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రహ్మనుల్లా గుర్జాజ్ కూడా వేగంగా పరుగులు తీశాడు. హజ్రతుల్లా జజాయ్ (44) వాట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నజీబుల్లా జర్దాన్, రహ్మనుల్లా కలసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
ప్రతీ ఓవర్‌లో బౌండరీ కొడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలసి 77 పరుగులు జోడించారు. రహ్మనుల్లా (46) డావే బౌలింగ్‌లో కోయిర్టెజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. నజీబుల్లా జర్దాన్ (59) అర్ద సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు మంచి స్కోర్ అందించాడు. కానీ చివరి బంతికి అవుటయ్యాడు. ఆఖర్లో కెప్టెన్ మహ్మద్ నబీ (11) రెండు బౌండరీలతో అలరించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు తీయగా.. జోష్ డేవ్, మార్క్ వాట్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు..
అఫ్గానిస్తాన్ 190/4
స్కాట్లాండ్ 60 ఆలౌట్