మరో వివాదంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీ.. ఇక రణరంగమే..!

దిశప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరో వివాదం చెలరేగింది. మొన్నటివరకు రిజిస్ట్రార్, పాలక మండలి అనుమతులు లేకుండా జరిగిన 113 ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల వివాదం ఇంకా కొలిక్కి రాకముందే ప్రైవేట్ బీఈడీ కళాశాలల అఫిలియేషన్ వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఉమ్మడి జిల్లా పరిధిలో బీఈడీ కళాశాలలకు అనుమతులు లేకుండానే అడ్మిషన్లకు సిద్ధమౌతున్నాయని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు ఉన్నత […]

Update: 2021-12-04 07:53 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరో వివాదం చెలరేగింది. మొన్నటివరకు రిజిస్ట్రార్, పాలక మండలి అనుమతులు లేకుండా జరిగిన 113 ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల వివాదం ఇంకా కొలిక్కి రాకముందే ప్రైవేట్ బీఈడీ కళాశాలల అఫిలియేషన్ వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఉమ్మడి జిల్లా పరిధిలో బీఈడీ కళాశాలలకు అనుమతులు లేకుండానే అడ్మిషన్లకు సిద్ధమౌతున్నాయని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వడంతో తాజాగా ఈ వివాదం ముదిరింది. బీఈడీ కాలేజీలకు పర్మిషన్ లేవని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం, వీసీని ఘెరావ్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాయి. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీలో అఫిలియేషన్ పైనే ప్రధానంగా వివాదం కొనసాగుతుంది.

2017-2018 సంవత్సరంలో బీఈడీ కాలేజీలకు అఫిలియేషన్‌‌ను పరిశీలించి అనుమతులు ఇచ్చారు. మరుసటి ఏడాది 2018-19లోనూ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చారు. తర్వాత కరోనా రావడంతో అఫిలియేషన్ ప్రక్రియ వాయిదా పడింది. కరోనా కారణంగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరుగున పడింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ప్రవేశ పరీక్ష నిర్వహించడంతో ప్రైవేట్ కళాశాలలు అఫియేషన్‌ల కోసం కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టులో ప్రైవేట్ బీఈడీ కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 14 బీఈడీ కాలేజీలుండగా అందులో 2 ప్రభుత్వానివి కాగా, మిగిలిన 12 ప్రైవేటుకు చెందిన వాటికి పర్మిషన్లు ఇచ్చారు. ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన వారికి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీకి సిద్ధమవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో విద్యాబోధన, కళాశాల నిర్వహణ విషయమై యాజమాన్యంలో ఆందోళన మొదలైంది.

తెలంగాణ యూనివర్సిటీ అంటే ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తరుచూ ఏదో ఒక వివాదం యూనివర్సిటీని పట్టి పీడిస్తోంది. యూనివర్సిటీ‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలే ఈ వివాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు కొందరు విద్యార్థుల వెనుక ఉండి కావాలనే ఆందోళనలు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఒక డైరెక్టర్‌ను తొలగించి ఆ పదవి తనకు ఇవ్వాలని కళాశాలలోని ఓ అధ్యాపకుడు కొత్త అంకానికి తెరలేపారని సమాచారం. యూనివర్సిటీ వివాదాలను కేంద్రంగా చేసుకుని డైరెక్టర్ పదవి పొందేందుకు అక్కడున్న వారిని తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది.

అక్టోబర్, నవంబర్ మాసంలో విశ్వవిద్యాలయంలో జరిగిన వివాదాలతో తెలంగాణ యూనివర్సిటీ పరువు గంగలో కలువగా, యూనివర్సిటీలో పదవుల కొరకు అధ్యాపకులే తెర వెనుక రాజకీయాలు చేస్తుండటంతో యూనివర్సిటీని వివాదాలు వీడటం లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆరోపణలున్నాయి. గడిచిన ఆగస్టులోనే 12 ప్రైవేట్ కళాశాలలకు అఫిలియేషన్లు ఇచ్చిన యూనివర్సిటీ ప్రస్తుతం విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు ఏ విధంగా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News