కాంగ్రెస్‌లో వారిద్దరు కలవటం కష్టమేనా..?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. గత కొన్నేళ్లుగా మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు మధ్య విభేదాలున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తాజాగా టీపీసీసీ చీఫ్ అయిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండగా.. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా […]

Update: 2021-07-09 15:22 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. గత కొన్నేళ్లుగా మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు మధ్య విభేదాలున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. తాజాగా టీపీసీసీ చీఫ్ అయిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండగా.. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా కొక్కిరాల దూరంగా ఉండిపోగా.. జిల్లా ఏలేటి మరింత పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు మధ్య మొదటి నుంచి విబేధాలున్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో ఇద్దరు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయాక తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇప్పటి వరకు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు నడపగా.. తాజాగా టీపీసీసీ కొత్త సారథిగా రేవంత్ రెడ్డి రాకతో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నాయకత్వాన్ని మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్నారు ఏలేటి. కోమటిరెడ్డి సోదరులతో ఉన్న విభేదాల కారణంగా మహేశ్వర్ రెడ్డి.. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలాంటి సీనియర్లు, ఉత్తర తెలంగాణ నాయకులకు టీపీసీసీ పదవి కట్టబెట్టాలని ప్రేమ్ సాగర్ రావు మొదటినుంచి తన గళాన్ని వినిపించారు. కానీ, ఏఐసీసీ దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఏఐసీసీలో కీలక పదవి ఇవ్వడంతో ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇప్పటికే తన అనుచరవర్గంలోని ముఖ్య నాయకులతో ప్రేమ్ సాగర్ రావు భేటీ అయ్యారు. తాను పార్టీ వీడనని చెబుతూనే.. ఉత్తర తెలంగాణ నాయకులకు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. దీంతో ఆయన రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. తాజాగా ఈనెల 7న గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కొక్కిరాలతో పాటు ఆయన వర్గీయులు దూరంగా ఉన్నారు. కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ కూడా కాలేదు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి కొక్కిరాలకి మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడిని కలవకపోవడం, ప్రమాణస్వీకారానికి వెళ్లక పోవడంతో ప్రేమ్ సాగర్ రావు ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. ఈ విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయనకు పదవి దక్కడంతో.. రాష్ట్ర నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ నెల 12న నిర్మల్ జిల్లాలో సైకిల్ యాత్ర నిర్వహిస్తుండగా.. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారు. రేవంత్ అధ్యక్షుడు అయ్యాక క్షేత్రస్థాయిలో తొలిసారిగా పర్యటిస్తుండగా.. అది నిర్మల్ జిల్లాకు వస్తున్నారు. దీనిని బట్టి చూస్తేనే.. మహేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏలేటి తన పట్టు మరింత పెంచుకుంటున్నారు. ఏలేటి, కొక్కిరాల మధ్య సయోధ్య ఇప్పట్లో కుదిరే పరిస్థితి కనిపించటం లేదు. కొత్త రథసారథి వీరిద్దర్నీ కలుపుతారా.. అందర్నీ ఏకతాటిపైకి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News