లంచాలు, సెటిల్మెంట్లతో ఇష్టారాజ్యం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పోలీసులు చేయాల్సిందేంటి? చేస్తున్నదేంటి? అనే ప్రశ్న పలువురి నుండి వినిపిస్తోంది. తమకు సంబంధంలేని కేసులను డీల్ చేయడం, సెటిల్‌మెంట్లు చేసి అందినకాడికి చేతబట్టడం, భారీగా సొమ్ము కూడబెట్టడమే లక్ష్యంగా లంచాలు తీసుకుంటూ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వారికి పై ఆఫీసర్లంటే పట్టింపు లేదు.. ఏసీబీ అంటే అదురు లేదు.. ఉద్యోగం ఊడుతుందన్న […]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పోలీసులు చేయాల్సిందేంటి? చేస్తున్నదేంటి? అనే ప్రశ్న పలువురి నుండి వినిపిస్తోంది. తమకు సంబంధంలేని కేసులను డీల్ చేయడం, సెటిల్‌మెంట్లు చేసి అందినకాడికి చేతబట్టడం, భారీగా సొమ్ము కూడబెట్టడమే లక్ష్యంగా లంచాలు తీసుకుంటూ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వారికి పై ఆఫీసర్లంటే పట్టింపు లేదు.. ఏసీబీ అంటే అదురు లేదు.. ఉద్యోగం ఊడుతుందన్న బెదురు లేదు.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 40 రోజుల్లో ఆరుగురు అధికారులు ఏసీబీ వలలో చిక్కుకున్నా శాఖలో మార్పు రావడం లేదు.. అక్రమాలు ఆగడం లేదని జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అవినీతి ఆరోపణలతో పోలీస్ శాఖ పేరు మారుమోగిపోతోంది. రాష్ర్టంలో, జిల్లా చరిత్రలో మొదటి సారీ సివిల్ పంచాయతీలు, బలవంతపు వసూళ్లు, సెటిల్‌మెంట్లలో ప్రమేయం ఉందని ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఇద్ధరు ఎస్ఐలు, ఒక కానిస్టెబుల్ ఏసీబీ వలలో చిక్కి కటకటాలపాలయ్యారు. 40 రోజుల్లోనే ఆరుగురు అధికారులు ఉమ్మడి జిల్లా నుండి ఏసీబీకి చిక్కడంతో అందరూ ఇక్కడి పోలీసుల గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రియల్ భూం ఉన్న ప్రాంతాలలో సివిల్ పంచాయితీలు, ఇతర సెట్‌మెంట్లు ఆగడం లేదు. అధికార పార్టీ అండతో చాలా ఠాణాలు పంచాయితీలకు అడ్డాలుగా మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. నుడా పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో పంచాయితీల సంఖ్య కూడా బాగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కోర్టులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే పనుల కన్నా పోలీస్ స్టేషన్ల ఫలానోళ్ల పనితో అయ్యేటివే ఎక్కువని అర్థమవుతోంది. ఇందుకు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతున్న ఒక ఘటనను పరిశీలిస్తే..
* అది నిజామాబాద్ నగర శివారులోని ఒక ప్రాంతం. బోధన్ రోడ్డును ఆనుకొని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది. అక్కడ ప్రైవేట్ సర్వే నెంబర్‌లో రెండు ఎకరాల భూమి ఉంది. దాని విలువ ప్రస్తుతం రూ.4 కోట్లకు పైమాటే. అయితే కొన్నేళ్ల కిందట ఆ భూమి యజమానికే తెలియకుండా చాలామంది చేతులు మారింది. ఆ విషయం తెలిసిన యజమాని కోర్టును ఆశ్రయించడంతో అనుకూల తీర్పు వచ్చింది. దాంతో ఆయన వెంటనే ఆ స్థలంలో నిర్మాణం చేపట్టాడు. కానీ అప్పటి వరకు ఆ స్థలంలో క్రయవిక్రయాలు నిర్వహించిన పలువురు అతనిని భయబ్రాంతులకు గురిచేయడం మొదలు పెట్టారు. అందులోని కొందరు పేరున్న నగర ప్రతినిధిని కలిసి విషయం చెప్పారు. ఆ తర్వాత ఆయనతో కలిసి స్థానిక ఒక పోలీస్ అధికారిని సంప్రదించారు. అది సివిల్ మేటర్ అయినా ఆ అధికారి కల్పించుకొని సెంటిల్‌మెంట్‌కు ఒప్పుకున్నాడు. అతని వద్ద పనిచేసే ఒక కానిస్టేబుల్ ద్వారా సివిల్ పంచాయితీకి తెరలేపాడు. భూమి యజమానిని తన కార్యాలయానికి రప్పించి రాజీ చేసుకోవాలని చెప్పాడు. దానికి యజమాని ససేమీరా అన్నాడు. దాంతో ఆ పోలీస్ అధికారి యజమానిని పోజిషన్‌లో ఉండనివ్వకుండా చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇందుకు కారణం ఆ అధికారికి భారీ ఆఫర్ ఉండడంతోనే ఈ వ్యవహారం ఇంతగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై భూ యజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే అవినీతి ఆరోపణలతో ఇటీవల పోలీస్ అధికారులు వరుసగా ఏసీబీ వలలో చిక్కుతున్నా ఇలాంటి ఘనటలు అలానే కొనసాగుతుండడం గమనార్హం.
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఘటనలు..
* అక్టోబర్ 28న బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు తన పరిధిలోని నస్రూల్లాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, భవిష్యత్తులో కేసుల పేరుతో వేధించకుండా ఉండేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం తన ఇంటిలోనే రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
* సెప్టెంబర్ 12న బోధన్ పట్టణ సీఐ పల్లే రాకేశ్ ఒక వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.1.3 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్, రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇదే కేసులో డబ్బుల వసూళ్లకు సహకరించిన ఎస్ఐ మొగులయ్య, కానిస్టేబుల్‌ను కుడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
* నవంబర్ 8న కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహకుడు సుధాకర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. అతడిని స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. ఈ కేసులో భవిష్యత్తులో వేధించకుండా ఉండేందుకు కామారెడ్డి సీఐ జగదీశ్ రూ.5 లక్షలు లంచంగా డిమాండ్ చేసి సుజయ్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా వాటిని వసూలు చేశారు. ఈ కేసులో నవంబర్ 20న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తోపాటు సుజయ్‌ను అరెస్టు చేశారు. మళ్లీ బెట్టింగ్ నిర్వహించి బట్టుబడిన సుధాకర్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వాడానికి రూ.20 వేల లంచం తీసుకున్న ఎస్ఐ గోవింద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే బెట్టింగ్ వసూళ్ల వ్యవహరంలో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణపై ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే డీఎస్పీ ఇంటిలో ఆయుధాలకు సంబంధించిన 30 తూటాలు లభ్యం కావడంతో హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది.