తెలంగాణలో ఆదుకోని ఆరోగ్య శ్రీ

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులలో ఏపీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో సెటిలర్స్ ఇబ్బందుల పాలవుతున్నారు. ఏపీ నుంచి వలస వచ్చిన చాలా మంది హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నివాసముంటున్నారు. వారందరికీ ఏపీలోని తమ సొంత ఊర్లలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అనుకోకుండా అనారోగ్యానికి గురైతే వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదు. ఏపీ ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులు వారిని తిప్పి పంపుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఖర్చు […]

Update: 2021-03-25 13:00 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులలో ఏపీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో సెటిలర్స్ ఇబ్బందుల పాలవుతున్నారు. ఏపీ నుంచి వలస వచ్చిన చాలా మంది హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నివాసముంటున్నారు. వారందరికీ ఏపీలోని తమ సొంత ఊర్లలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అనుకోకుండా అనారోగ్యానికి గురైతే వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదు. ఏపీ ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రులు వారిని తిప్పి పంపుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఖర్చు భరించలేక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాస్పత్రులలో ఈ పథకం కింద పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు. తెలంగాణలో సెటిలైనవారి కోసం ఏపీ ప్రభుత్వం 2019 లో తెలంగాణలోని 70 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ చికిత్సకు అనుమతినిచ్చింది.

ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులు లేకపోవడం, అన్నీ ప్రైవేట్ ఆస్పత్రులే కావడం సమస్యగా మారింది. ఈఎన్టీ ఆస్పత్రులు పరిమితంగా ఉండడంతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. అక్కడ ఏపీ ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. పుట్టుకతోనే చెవుడు ఉన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఐదేండ్లలోపు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కింద అయితే ఉచిత వైద్యం అందించే అవకాశం ఉంది. ఇదే శస్త్ర చికిత్స ప్రైవేట్ ఆస్పత్రులలో చేస్తే కనీసం రూ 10 లక్షలు కావాలి. అంత మొత్తం చెల్లించలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు.

తెరుచుకోని సైట్..

ఈఎన్జీ బాధితుల వివరాలను ఏపీ ఆరోగ్యశ్రీలో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తే సైట్ తెరుచుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ఏపీ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే ఫైలు ఏపీ సీఎంఓ కార్యాలయంలో పెండింగ్ లో ఉందని సమాచారం. ఈ ఫైలు ముందుకు సాగితే తెలంగాణలో కూడా ఏపీ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందే అవకాశం ఉంది.

‘నేను రాళ్లపై శిల్పాలు చెక్కి ఉపాధి పొందుతున్నాను. నాకు ఇద్దరు కూతుర్లు. చిన్న కూతురు చంద్రికకు పుట్టుకతోనే చెవుడు ఉంది. ఏపీ, తెలంగాణ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రస్తుతం మా కూతురుకు ఐదేండ్లు నిండాయి. సమయం ఇలానే గడిస్తే నా కూతురు జీవితాంతం చెవిటితనంతోనే గడపాల్సిన దుస్థితి. ఈఎన్టీ ఆస్పత్రికి వెళితే ఏపీ ఆరోగ్యశ్రీ చెల్లదంటున్నారు. నా కూతురును ఆదుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయపడాలి. మురళి, బాధితురాలి తండ్రి.

‘ఏపీ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారికి మా హాస్పిటల్ లో వైద్యం చేసేందుకు అనుమతులు లేవు. కాక్లియర్ ఇంప్లాంట్ చేయవలసిన పిల్లల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వారి శస్త్ర చికిత్సలకు అయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వమే చెల్లించవలసి ఉంటుంది. వారికి వైద్యం అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అనుమతులు ఇస్తే పేద రోగులకు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్

Tags:    

Similar News