IPL 2025 : రిషబ్ పంత్‌కు భారీ ఫైన్

ముంబై ఇండియన్స్‌పై విజయంతో సాధించిన ఆనందంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు.

Update: 2025-04-05 19:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్‌పై విజయంతో సాధించిన ఆనందంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. కెప్టెన్ రిషబ్ పంత్‌తోపాటు యువ స్పిన్నర్ దిగ్వేశ్‌కు జరిమానా విధించారు. పంత్‌కు రూ. 12 లక్షలు పడగా.. దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతపెట్టారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో స్లో ఓవర్ నిబంధనను ఉల్లంఘించింది. నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టర్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడిన మూడో కెప్టెన్ పంత్. ఇంతకుముందు పాండ్యా, రియాన్ పరాగ్‌ జరిమానా ఎదుర్కొన్నారు. మరోవైపు, యువ స్పిన్నర్ దిగ్వేశ్.. నమన్ ధిర్ అవుటైన తర్వాత ‘సంతకం’ చేసినట్టుగా సంబరాలు చేసుకున్నాడు. ప్రత్యర్థి ప్లేయర్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 లెవల్ 1 నేరంగా పరిగణిస్తారు. దీంతో దిగ్వేశ్‌ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతపెట్టడంతోపాటు రెండు డీమెరిట్ పాయింట్స్ కేటాయించారు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కూడా ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేశ్ ఇలాంటి సంబరాలే చేసుకున్నాడు. అప్పుడు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ విధించడంతోపాటు ఒక్క డీమెరిట్ పాయింట్ ఇచ్చారు.

Tags:    

Similar News