తొలిసారిగా ఐపీఎల్ ఆడినప్పుడు నా ఫీలింగ్ అదే : విరాట్ కోహ్లీ
తొలిసారిగా ఐపీఎల్ ఆడేటప్పుడు భయపడ్డానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : తొలిసారిగా ఐపీఎల్ ఆడేటప్పుడు భయపడ్డానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ ఆరంభం సీజన్ నుంచి కోహ్లీ ఆర్సీబీ తరపునే ఆడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ ఐపీఎల్‌లో తన ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘ఐపీఎల్‌కు ముందు నార్త్ జోన్ నుంచి జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లను మినహా నేను ఎవరిని కలవలేదు. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం ఉత్సాహంగా అనిపించింది. అదే సమయంలో ఒత్తిడి కూడా ఉంది. అప్పటికి నా ఆట ఆ స్థాయిలో లేదని నాకు తెలుసు. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. మొదటి మూడేళ్లలో ఆర్సీబీ తరపున టాపార్డర్‌లో ఆడేందుకు నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. సాధారణంగా లోయర్ ఆర్డర్‌లోనే వచ్చేవాడిని. కాబట్టి, ఆరంభంలో ఇంపాక్ట్ ఇన్నింగ్స్‌లు ఆడే చాన్స్ రాలేదు. కానీ, 2009 సీజన్ నాకు మెరుగ్గా అనిపించింది. పిచ్‌లు నా ఆటకు సరిపోయాయి. బంతి నేరుగా బ్యాట్‌పైకి రావడంతో నేను స్వేచ్ఛగా ఆడగలిగాను. నా కెరీర్‌లో అది కచ్చితంగా ఆసక్తికరమైన దశ. 2010 నుంచి నిలకడగా రాణించాను. 2011 నుంచి 3వ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నాను. అప్పుడు నా ఐపీఎల్ జర్నీ కొత్తగా రూపుదిద్దుకుంది.’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.