ఐపీఎల్‌లో పరుగుల హైదరా‘బాద్‌షా’

Update: 2024-04-15 19:19 GMT

ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసాన్ని అభిమానులు ఇంకా మరవనేలేదు. 20 రోజుల వ్యవధిలోనే ఆ జట్టు మరో తుపాన్‌తో బీభత్సం సృష్టించింది. ఎం.చిన్నస్వామి స్డేడియం దీనికి వేదికైంది. హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ పరుగుల సునామీని ఆరంభించగా.. క్లాసెన్, అబ్దుల్ సమద్, అభిషేక్, మార్‌క్రమ్ మెరుపులు కూడా తోడయ్యాయి. ఇంకేముంది.. ఐపీఎల్‌లో హయ్యెస్ట్ స్కోరు రికార్డు మరోసారి బద్దలైంది. గత నెల 27న ఉప్పల్ స్టేడియంలో ముంబైపై 277 స్కోరుతో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అవతరించిన హైదరాబాద్.. బెంగళూరుపై 287 స్కోరు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఐపీఎల్‌లో పరుగుల బాద్‌షాగా అందనంత ఎత్తులో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 287/3 స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్(102, 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని మెరుపు శతకానికితోడు క్లాసెన్(67), అబ్దుల్ సమద్(37 నాటౌట్), మార్‌క్రమ్(32), అభిషేక్ శర్మ(34) చెలరేగడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. అనంతరం 288 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 262/7 స్కోరు చేసి పోరాడి ఓడింది. దినేశ్ కార్తీక్(83), డుపెస్లిస్(62) పోరాటం ఫలించలేదు. బెంగళూరుకు వరుసగా ఇది ఐదో ఓటమి. మొత్తంగా ఆరోవది. ఈ పరాజయంతో ఆ జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాయింట్స్ టేబుల్‌లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా.. బెంగళూరు అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నది.

బెంగళూరు పోరాడినా..

288 పరుగుల భారీ లక్ష్య ఛేదనను చూసి బెంగళూరు బ్యాటర్లు బెదరలేదు. ఓపెనర్లు డుపెస్లిస్. కోహ్లీ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. మొదటి నుంచే వీరు బౌలర్లపై విరుచుకపడటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 79/0 స్కోరుతో నిలిచింది. 7వ ఓవర్‌లో కోహ్లీ(42)ని మార్కండే అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే డుప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. అదే ఓవర్‌లో విల్ జాక్స్(7) రనౌటయ్యాడు. మరోవైపు, హైదరాబాద్ బౌలర్లు కూడా పుంజుకున్నారు. రజత్ పటిదార్(9) నిరాశపర్చగా.. కమిన్స్ ఒకే ఓవర్‌లో డుప్లెసిస్(62) దూకుడుకు చెక్ పెట్టడంతోపాటు సౌరవ్ చౌహాన్(0)ను అవుట్ చేశాడు. 42 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ 122/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఇక, ఆర్సీబీ పోరాటం కష్టమే అనిపించింది. ఈ పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లను పరుగులు పెట్టించిన అతను ఒక్కసారిగా ఆర్సీబీ జట్టులో ఆశలు రేపాడు. అయితే, చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటం, బంతులు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో.. మరో ఎండ్‌లో అతనిలా బ్యాటు ఝుళిపించే వారు కరువయ్యారు. అయినా, ఒంటరి పోరాటం చేసిన కార్తీక్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో బెంగళూరు 230/6 స్కోరుతో నిలువగా.. 12 బంతుల్లో ఆ జట్టుకు ఇంకా 58 పరుగులు కావాలి. 19వ ఓవర్‌లో కార్తీక్(83)ను నటరాజన్ అవుట్ చేయగా.. చివరి ఓవర్‌లో అనుజ్ రావత్(25 నాటౌట్) 18 పరుగులు పిండుకోవడంతో బెంగళూరు లక్ష్యానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లతో సత్తాచాటగా..మార్కండే 2 వికెట్లు, నటరాజన్ ఒక్క వికెట్ తీశాడు.

హెడ్ ఊచకోత

అంతకముందు హైదరాబాద్ బ్యాటర్ల పరుగుల వరద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్లు ప్రేక్షకపాత్రకే పరిమితమైన వేళ పెను తుపాన్ సృష్టించారు. మొదట ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ముఖ్యంగా హెడ్ విధ్వంసం అంతా ఇంతా కాదు. రెండో ఓవర్‌లో వరుసగా ఫోరు, సిక్స్ బాది ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన అతను క్రీజులో ఉన్నంత సేపు వీరవిహారం చేశాడు. అతను ఏ బౌలర్లను వదల్లేదు. అలవోకగా ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు దంచేశాడు. దీంతో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్ శర్మ(34) అవుటైన తర్వాత క్లాసెన్ సహకారంతో అతను మరింత రెచ్చిపోయాడు. దీంతో హాఫ్ సెంచరీ తర్వాత హెడ్ మరో 19 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో హెడ్(102) దూకుడుకు ఫెర్గూసన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆర్సీబీ బౌలర్లు ఊపిరి పీల్చుకోగా.. వారికి మిగతా బ్యాటర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. హెడ్ అవుటైనా మార్‌క్రమ్‌తో కలిసి క్లాసెన్ అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్లలోనే హైదరాబాద్ 200 స్కోరు దాటడంతో గత నెలలో ముంబై(277)పై నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టేలా కనిపించింది. కాసేపటికే క్లాసెన్ అవుటైనా.. అబ్దుల్ సమద్(37 నాటౌట్), మార్‌క్రమ్(32 నాటౌట్) మెరుపులతో హైదరాబాద్ మరో సంచలనం సృష్టించింది. తన రికార్డును తానే బద్దలుకొట్టిన హైదరాబాద్ 287 స్కోరుతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. టోప్లీకి ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 287/3(20 ఓవర్లు)

అభిషేక్ శర్మ(సి)ఫెర్గూసన్(బి)టోప్లీ 34, హెడ్(సి)డుప్లెసిస్(బి)ఫెర్గూసన్ 102, క్లాసెన్(సి)విజయ్‌కుమార్(బి)ఫెర్గూసన్ 67, మార్‌క్రమ్ 32 నాటౌట్, అబ్దుల్ సమద్ 37 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 15.

వికెట్ల పతనం : 108-1, 165-2, 231-3

బౌలింగ్ : విల్ జాక్స్(3-0-32-0), టోప్లీ(4-0-68-1), యశ్ దయాల్(4-0-51-0), ఫెర్గూసన్(4-0-52-2), విజయ్‌కుమార్(4-0-64-0), మహిపాల్ లోమ్రోర్(1-0-18-0)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 262/7(20 ఓవర్లు)

కోహ్లీ(సి)మార్కండే 42, డుప్లెసిస్(సి)క్లాసెన్(బి)కమిన్స్ 62, విల్ జాక్స్ రనౌట్(జయదేవ్ ఉనద్కత్) 7, రజత్ పటిదార్(సి)నితీశ్(బి)మార్కండే 9, సౌరవ్ చౌహాన్ ఎల్బీడబ్ల్యూ(బి)కమిన్స్ 0, దినేశ్ కార్తీక్(సి)క్లాసెన్(బి)నటరాజన్ 83, మహిపాల్ లోమ్రోర్(బి)కమిన్స్ 19, అనుజ్ రావత్ 25 నాటౌట్, విజయ్‌కుమార్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 14.

వికెట్ల పతనం : 80-1, 100-2, 111-3, 121-4, 122-5, 181-6, 244-7

బౌలింగ్ : అభిషేక్(1-0-10-0), భువనేశ్వర్(4-0-60-0), షాబాజ్(1-0-18-0), నటరాజన్(4-0-47-1), కమిన్స్(4-0-43-3), మార్కండే(4-0-46-2), జయదేవ్ ఉనద్కత్(2-0-37-0)

Tags:    

Similar News