టీ20 వరల్డ్ కప్‌లో ఆ భారత క్రికెటర్‌పైనే ఫోకస్ : బాబర్ ఆజామ్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాక్ పోరు జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది.
దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాక్ పోరు జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు.పొట్టి ప్రపంచకప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. ఈ నెలలో పాక్ జట్టు టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్‌కు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ సందర్భంగా బాబర్ మాట్లాడుతూ.. ‘ఒక జట్టుగా మా ప్రత్యర్థి జట్ల బలాబలాలను బట్టి విజయం కోసం ప్రణాళికలు వేస్తుంటాం. ప్రత్యేకంగా ఒక ఆటగాడి గురించే ప్లాన్ చేయం. కానీ, మేము విరాట్ గురించి ఆలోచిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లలో అతను ఒకడు. కాబట్టి, అతను కట్టడి చేసేందుకు ప్లాన్ చేస్తాం.’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. టీ20ల్లో పాక్‌పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 10 మ్యాచ్‌ల్లో 81.33 సగటుతో 123 స్ట్రైక్‌రేటుతో 488 పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్, పాక్ జట్లు చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే.