Viral Video: 20ఏళ్ల తర్వాత మళ్ళీ వైరల్.. జహీర్ ఖాన్ కి స్టేడియంలోనే ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి గుర్తుందా?
Zaheer Khan: క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. అవి కాలక్రమేణా కనుమరుగు అవుతుంటాయి.
దిశ, వెబ్ డెస్క్: Zaheer Khan: క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణాలు ఎన్నో ఉన్నాయి. అవి కాలక్రమేణా కనుమరుగు అవుతుంటాయి. కానీ వాటి చర్చ మాత్రం నడుస్తూనే ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనతోపాటు..ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం పాటు నిలిచి ఉండే ఇలాంటి ఫన్నీ సీన్స్ చాలానే ఉన్నాయి. 2005లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్టేడియంలో ఒక అమ్మాయి భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కు బహిరంగంగా ప్రేమను ప్రతిపాదించింది. ఈ సంఘటన అప్పట్లో వైరల్(Viral Video) అయ్యింది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తరువాత, దానికి సంబంధించిన మరొక ఫోటో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.
మార్చి 24, 2005న, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో, వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించడానికి దగ్గరగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిర్వహిస్తున్నాడు. తర్వాత కెమెరా స్టాండ్ మీద కూర్చుని, చేతిలో ప్లకార్డు పట్టుకుని ఉన్న ఒక అందమైన అమ్మాయి వైపు తిరిగింది. ఆ బోర్డు మీద "జహీర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని రాసి ఉంది.
ఈ ఊహించని దృశ్యం స్టేడియం వాతావరణాన్నే మార్చేసింది. ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వుతూ, పదే పదే కెమెరా నుండి దూరంగా చూస్తోంది. క్షణాల్లోనే, ఆ దృశ్యం స్టేడియంలోని స్క్రీన్ పై ప్లే అయ్యింది. ప్రేక్షకులు సైతం ఆ అమ్మాయి పట్టుకున్న కార్డును చూసి కేరింతలు కొట్టారు. ఆ అమ్మాయి కెమెరా వైపు చూసి జహీర్ ఖాన్ కు ఫ్లయింగ్ కిస్ పంపింది. జహీర్ ఖాన్(Zaheer Khan's) డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఇదంతా చూస్తున్నాడు. ఆ అమ్మాయి పట్టుకున్న కార్డు ను చూసి జహీర్ ఖాన్ కూడా చిరునవ్వులు చిందించాడు. ప్రతిస్పందనగా ఫ్లయింగ్ కిస్ చేశాడు. ఇదంతా చూసిన యువరాజ్ సింగ్ బిగ్గరగా నవ్వాడు. సెహ్వాగ్, ద్రవిడ్ కూడా క్రీజులో నిలబడి ఈ సరదా క్షణాన్ని ఆస్వాదించారు. స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు కూడా ఈ క్షణాన్ని చప్పట్లు కొడుతూ సందడి చేశారు. దీంతో స్టేడియం మొత్తం నవ్వులతో మారుమ్రోగింది.
దాదాపు 20 సంవత్సరాల తరువాత, ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో “అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్రికెట్” అనే ఖాతా 2005 నాటి చిత్రాలను షేర్ చేసింది. దీనిలో, 2005, 2025గా మార్చారు. వైరల్ చిత్రంలో కనిపిస్తున్న మహిళ 2005లో జహీర్ ఖాన్‌కు ప్రపోజ్ చేసిన అమ్మాయి అని చెబుతున్నారు. అయితే, వైరల్ అవుతున్న ఫోటో అదే అమ్మాయిదా కాదా అనేది నిర్ధారించలేదు.
అప్పటికీ జహీర్ ఖాన్ కు వివాహం కాలేదు. తర్వాత బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గేను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాస్తూ.. “ఇప్పుడు సాగరిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి!” అంటూ కామెంట్ చేయగా.. మరొక నేటిజన్ "జహీర్ భాయ్ బ్యాట్ పని చేయలేదు. కానీ అతని హృదయం ఖచ్చితంగా క్లీన్ బౌల్డ్!" అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.