దాస్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి..

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని దాస్ నగర్ లోని మహాత్మాగాంధీ జ్యోతి బాపులే వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-07-14 17:04 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని దాస్ నగర్ లోని మహాత్మాగాంధీ జ్యోతి బాపులే వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. దాస్ నగర్ దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను తప్ప తాగి కారును రాంగ్ రూట్లో సతీష్ అనే వ్యక్తి అతి వేగంగా నడుపుతూ ఆ ఇద్దరు మహిళలు ఢీ కొట్టాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో పోచవ్వ (64), పద్మ (35)లు అక్కడికక్కడే మృతి చెందారు. మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో, ఇంటర్మీడియట్ లలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినిలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్పారు. జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను రెండవ ఆదివారం తల్లిదండ్రులు చూసేందుకు వస్తున్న నేపథ్యంలో ఆ విద్యార్థులకు ఔటింగ్ కు తీసుకెళ్లి పాఠశాలకు తిరిగి వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాద ఘటన సంభవించింది.

రోడ్డు ప్రమాద సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న నిజామాబాద్ సీఐ సుధీర్ రావు, మాక్లూర్ ఎస్సై సతీష్ లు పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న సతీష్ నిజామాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నట్లు మాక్లూర్ పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం జరిగిన సందర్భంలో కారు నడుపుతున్న సతీష్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు వివరించారు. అటు తర్వాత రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సీఐ మహేష్, నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ లు పరిశీలించారు. మద్యం సేవించి కారును అతివేగంగా నడుపుతున్న ఆర్డీవో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మాక్లూర్ ఎస్సై సతీష్ తెలిపారు.


Similar News