పుట్టిన రోజు వేడుకల్లో విషాదం
పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.
దిశ, ఘట్కేసర్ : పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్ఫద స్థితిలో స్విమ్మింగ్ పూల్ లో పడి ఐటీ ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్లో ఓ ఐటీ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న శ్రీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా ఘట్కేసర్ మండలం, ఘనపూర్ లోని ఓ గెస్ట్ హౌస్ కు 20 మంది తోటి ఉద్యోగులతో కలిసి సోమవారం అర్ధరాత్రి వరకు విందు చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకున్నారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఈత రాని అజయ్ తేజ(24)ని రంజిత్ రెడ్డి, సాయికుమార్, వెంకటేష్ లు స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు. 40 నిమిషాల తర్వాత నీటిలోనే మునిగిపోయి ఉన్న అజయ్ ని గుర్తించి వెంటనే బయటికి తీశారు. సమీపంలోని సూర్య హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే అజయ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వెంటనే స్నేహితులు అజయ్ సమీప బంధువుకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి మేనమామ కిషోర్ కుమార్ ఫిర్యాదు మేరకు అజయ్ స్నేహితులు శ్రీకాంత్, రంజిత్ రెడ్డి, సాయికుమార్, గెస్ట్ హౌస్ యజమాని వెంకటేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించి దర్యాప్తు చేస్తున్నారు.