ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్..

అన్నమయ్య జిల్లా సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిల్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-06-24 03:04 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:అన్నమయ్య జిల్లా సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిల్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచు బాబు ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఐ సురేష్ బాబు టీమ్ శనివారం రాత్రి నుంచి అన్నమయ్య జిల్లా సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టారు.

ముదుంపాడు అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిలో ముగ్గురిని పట్టుకోగలిగారు. వారిని తమిళనాడు తిరుపత్తూరు జిల్లా కు చెందిన విజయకుమార్ (37), మోహనవేల్ (25), శక్తివేల్ (27)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి, ఆదివారం తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News