ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలికను రైల్వే పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.

Update: 2024-08-08 15:31 GMT

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలికను రైల్వే పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లో కిడ్నాప్ కేసును రైల్వే పోలీసులు ఛేదించి నిందితున్నిఅరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో అర్బన్ డీఎస్పీ జావేద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జగద్గిరిగుట్టకి చెందిన జావిద్, గౌసియా బేగం దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గౌసీయా బేగం తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని జనగామలోని తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఈనెల 6న సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చింది. రాత్రి 8.20 గంటల సమయంలో చిన్న కూతురు నైరా బేగం(5) ను స్టేషన్లోని టాయిలెట్స్ పక్కన పిల్లర్ గద్దెపై కూర్చోబెట్టి పిల్లలకు భోజనం తెచ్చేందుకు స్టేషన్ బయటకు వెళ్లింది. అదే సమయంలో గుర్తుతెలియని దుండగుడు బాలికకు మాయమాటలు

     చెప్పి అపహరించుకొని తీసుకెళ్లాడు. బయట నుంచి భోజనం తీసుకుని కొద్ది నిముషాలలోనే తిరిగి స్టేషన్ లోపలికి వచ్చి చూడగా తన కూతురు కనిపించలేదు. దీంతో కంగారు పడిన గౌసియా బేగం తన కూతురు ఆచూకీ కోసం ఆ రాత్రంతా వెదికింది. తెలిసిన వారు, బంధువులకు ఫోన్​ చేసినా కూతురు ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే ఓ వ్యక్తి బాలికను తీసుకుని స్టేషన్ నుంచి బయటకువెళ్లి ఆటోలో ఎక్కి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో రైల్వే పోలీసులు నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు బాలిక కిడ్నాప్ విషయాన్ని చేరవేసి అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక వైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగానే కిడ్నాపర్ మెహదీపట్నంలో

    ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మెహదీపట్నం బస్టాండ్లో ఉన్న కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని బాలికను కాపాడారు. కిడ్నాపర్ను సికింద్రాబాద్​ తీసుకువచ్చి విచారించగా కిడ్నాపర్ మణికొండలో నివాసముంటున్న ఎండీ పర్వేజ్ గా వెల్లడించాడని డీఎస్పీ జావెద్ తెలిపారు. బిహార్ బంకా జిల్లా రాయ్పూర్​కు చెందిన ఎండీ.పర్వేజ్ ఉపాధికోసం నగరానికి వచ్చి మణికొండలో నివాసముంటూ అదే ప్రాంతంలోని ఓ చికెన్​ సెంటర్లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే బాలికను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆర్థిక సమస్యల కారణంగా మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, ఆ తర్వాత డబ్బులు డిమాండ్‌ చేసేందుకు ప్రయత్నించానని నిందితుడు పర్వేజ్ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించిన పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 

Tags:    

Similar News